18 August, 2026 | 4:44 PM

Breaking News

బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం

18-08-2026 03:58 PM

* సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలి

* ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటు బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక

* కీతవారిగూడెంలో ఘనంగా పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

గరిడేపల్లి,(విజయక్రాంతి): బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా పనిచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని గౌడ సంఘం సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రెటరీ గుండు రాంబాబు గౌడ్, ప్రజాగాయకుడు గద్దర్ బాదే నరసయ్య పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గరిడేపల్లి మండల అధ్యక్షుడు పోలంపల్లి ఆనంద్‌బాబు గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ అన్ని కులాలు, వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. ఆయన చూపిన ధైర్యం, సాహసం, సామాజిక సమానత్వం, స్వాభిమానం వంటి విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

బహుజన రాజ్యాధికారాన్ని సాధించి, మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకునే దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.