2 August, 2026 | 2:34 PM

సంగమేశ్వరుడిని తాకి సోమశిల వైపు ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

02-08-2026 01:11 PM

కొల్లాపూర్ రూరల్: నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని లలిత సోమేశ్వర ఆలయాల సమీపంలో ఉన్న సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని తాకుతూ కృష్ణానది ఉప్పొంగి సోమశిల వైపు ప్రవహిస్తోంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమా, మలపహరణి, భవనాసి అనే ఏడు నదులు ఇక్కడ సంగమించడం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎండాకాలంలో నీటి కొరతతో వెలవెలబోయిన కృష్ణమ్మ ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద జలాలతో పరవళ్లు తొక్కుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమ్మకు 300 ఒత్తులతో దీపారాధన చేసి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ప్రధాన పురోహితుల కథనం ప్రకారం, ద్వాపరయుగంలో ధర్మరాజు ఇక్కడ వేపదారుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అందుకే స్వామివారిని వేపదారు సంగమేశ్వరుడని కూడా పిలుస్తారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు సోమశిలకు చేరుతోంది. దీంతో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతుండటాన్ని పర్యాటకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే బోట్లను నడపవద్దని బోటు యజమానులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.