గ్రంథాలయంలో మొక్కలు నాటిన ఆర్డీఓ
విద్యార్థులతో ముఖాముఖి
బోధన్, ఆగస్టు 02 (విజయ క్రాంతి): బోధన్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు (ప్రభుత్వ పథకాలు) పి. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్ మునిసిపల్ టౌన్ పరిధిలోని ప్రభుత్వ గ్రంథాలయంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో ఎం. విజయకుమారి, మునిసిపల్ చైర్‌పర్సన్ టి. పద్మ శరత్ రెడ్డి, కౌన్సిలర్లు టి. శరత్ రెడ్డి, ఏ. దామోదర్, రాజకీయ ప్రముఖులు గంగా శంకర్, పాషా తదితరులు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు కలిసి ఆర్డీవో ఎం. విజయకుమారి, మునిసిపల్ చైర్‌పర్సన్ టి. పద్మ శరత్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఆర్డీవో, చైర్‌పర్సన్ గ్రంథాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లైబ్రరీ హాల్, స్టడీ రూములు, కంప్యూటర్ గది, భోజన ప్రాంగణం, విశ్రాంతి గది, మూత్రశాలలు తదితర విభాగాలను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలను పరిశీలించి, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, మారుతున్న పోటీ పరీక్షల సిలబస్‌కు అనుసరించి నాణ్యమైన పుస్తకాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం విడుదలైన మరియు త్వరలో వెలువడనున్న వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న గ్రంథాలయ, విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే దిశగా కృషి చేయాలని ప్రోత్సహించారు. గ్రంథాలయంలో అవసరమైన అదనపు సదుపాయాలు, మౌలిక వసతుల అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా మంజూరు అయ్యేలా కృషి చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి గ్రంథాలయ అభివృద్ధి కోసం గతంలో కల్పించిన పలు సౌకర్యాలను గుర్తు చేసుకుంటూ, ఆయన సహకారంతో గ్రంథాలయం ఆధునిక వసతులతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి ఎమ్మెల్యే అందిస్తున్న సహకారం ఎల్లప్పుడూ ఆదర్శనీయమని కొనియాడారు.






