29 April, 2026 | 3:00 PM

Breaking News

'ఒక్క రూపాయి' అంత్యక్రియలకు నిబంధనల ఉచ్చు

29-04-2026 12:07 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): పేదవాడి ఆఖరి ప్రయాణానికి అండగా నిలిచిన 'అంతిమ యాత్ర - ఆఖరి సఫర్' పథకం ఇప్పుడు వివాదాలకు వేదికైంది. మానవత్వంతో మొదలైన ఈ గొప్ప పథకాన్ని అధికారులు నిబంధనల పేరుతో సామాన్యులకు దూరం చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా జరిగిన ఘటనలు అనుమానాలను మరింత పెంచుతున్నాయి.

వరంగల్ వ్యక్తి మృతి: 

35వ డివిజన్‌లో నివసిస్తున్న వ్యక్తి మరణిస్తే, స్థానిక ఆధారం లేదని అధికారులు నిరాకరించడంతో ఆగ్రహించిన కార్పొరేటర్ భర్త గుగ్గిళ్ల రమేష్ మున్సిపల్ కార్యాలయంలో ఆవేశంగా అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు 

అనాథ వృద్ధుడి కడచూపు: 

వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో వృద్ధుడు మరణిస్తే, గుర్తింపు కార్డుల పేరుతో అధికారులు అడ్డుచెప్పారు. నిన్న సాయంత్రం జరగాల్సిన అంత్యక్రియలు కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ అధికారులతో పోరాడి ఎట్టకేలకు ఈరోజు మధ్యాహ్నం పూర్తయ్యేలా చూశారు.

అధికారుల తీరుపై ప్రశ్నలు

బతుకుతెరువు కోసం వలస వచ్చిన వారు, అద్దె ఇళ్లలో ఉండేవారు స్థానిక ఆధార్ కార్డులు ఎక్కడి నుండి తెస్తారు. అనాథాశ్రమాల్లో ఉండే వృద్ధులకు, అనాథలకు గుర్తింపు పత్రాలు ఉండటం సాధ్యమేనా? అనాథ వృద్ధులకు ఉచితంగా ఆశ్రయమివ్వడమే ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్న సేవా కార్యక్రమం. అలాంటి సేవచేసే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాల్సింది పోయి నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టడం భావ్యమా చనిపోయిన వేళ కూడా నిబంధనల పేరుతో అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పడం ధర్మమేనా? ఏడేళ్ల క్రితం అప్పటి మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రారంభించిన ఈ పథకం దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. ఆనాడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా మెచ్చుకున్న ఈ మానవీయ పథకాన్ని ఆంక్షలతో నీరుగార్చకండి. గౌరవప్రదంగా జరగాల్సిన అంత్యక్రియలు సకాలంలో జరిగితేనే, ఆ పేద కుటుంబానికి ఇచ్చే నిజమైన వీడ్కోలు. మున్సిపల్ పాలకవర్గం మరియు అధికారులు వెంటనే స్పందించి, స్థానిక-స్థానికేతర భేదం లేకుండా ప్రతి పేదవాడికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి.