ప్రజాసేవలో ’గౌరవం’ ఎంత?
అణగారిన వర్గాల ప్రతినిధుల ఆర్థిక నిశ్శబ్ద సమరం
సత్తుపల్లి, మార్చి 6 (విజయక్రాంతి): మున్సిపల్ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి పునాది. పట్టణ అభివృద్ధిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంత కీలకమో, వార్డు కౌన్సిలర్లు అంతకంటే ఎక్కువ ప్రజలకు చేరువగా ఉంటారు. కానీ, నేడు ఆ కౌన్సిలర్ల పరిస్థితి ’బయటికి హోదా... లోపల ఆర్థిక వ్యథ’ అన్నట్లుగా మారింది.
ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు అందుతున్న గౌరవ వేతనాలు ఇలా ఉన్నాయి :
మున్సిపల్ చైర్మన్ : రూ. 15,600
వైస్ చైర్మన్ : రూ. 6,500
వార్డు కౌన్సిలర్లు : రూ.3,250
స్వల్ప వేతనం.. భారమైన సేవ..
పెరుగుతున్న ధరలు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా నెలకు రూ. 3,250 వేతనం అనేది వారి కనీస ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ముఖ్యంగా దళిత, గిరిజన, బీసీ మరియు ఇతర అణగారిన వర్గాల నుండి ప్రజాసేవే ఆశయంగా గెలిచిన కౌన్సిలర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నికల్లో చేసిన అప్పులు, రోజువారీ రాజకీయ ఖర్చుల మధ్య వారు నలిగిపోతున్నారు.
ప్రజలకు వారే మొదటి దిక్కు..
వార్డులో ఏ చిన్న సమస్య వచ్చినాడ్రైనేజీ ఆగినా, నీళ్లు రాకపోయినా, పెన్షన్లు అందకపోయినాప్రజలు వెతికే మొదటి వ్యక్తి వార్డు కౌన్సిలరే. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఫోన్ కాల్స్, క్షేత్రస్థాయి పర్యటనలతో వారు గడుపుతారు. సొంత పనులను, కుటుంబాన్ని పక్కనబెట్టి ప్రజల కోసం తిరిగే వీరికి ప్రభుత్వం ఇచ్చే ఈ ’గౌరవ వేతనం’ వారి త్యాగానికి తగిన గుర్తింపుగా లేదన్నది చేదు నిజం.
అభివృద్ధి, మౌలిక వసతులతో పాటు ఉపాధిపై దృష్టి
సత్తుపల్లి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోనే పూర్తి కాదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై కూడా దృష్టి సారించాలి. పారిశుధ్య మెరుగుదల. యువతకు స్థానిక పరిశ్రమలు లేదా శిక్షణా కేంద్రాల ద్వారా ఉపాధి. అణగారిన వర్గాల జీవన ప్రమాణాలు పెంచడం. ఇవి జరిగినప్పుడే ప్రజలు ఉంచిన నమ్మకానికి నిజమైన సార్థకత లభిస్తుంది.
ప్రభుత్వం స్పందించాలి.
ప్రజాసేవ అనేది త్యాగంతో కూడుకున్న పని. అయితే, ఆ సేవ చేసే వారు ఆర్థికంగా కుంగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కౌన్సిలర్ల గౌరవ వేతనాన్ని సమీక్షించి, కనీస జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలి. అప్పుడే నిజాయితీ గల నాయకులు రాజకీయాల్లో నిలబడగలరు, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది.




