ఈవీఎం గోడౌన్ భద్రతను నిరంతరం పర్యవేక్షించాలి
కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 4, (విజయక్రాంతి): కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెలా క్రమం తప్పకుండా గోడౌన్లను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమైన అంశమని, అందుకు అనుగుణంగా అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థ, విద్యుత్ బ్యాకప్, భద్రతా పర్యవేక్షణ ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గోడౌన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భద్రతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ గోడౌన్లోకి అనుమతించరాదని ఆదేశించారు.
గోడౌన్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏవైనా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఈవీఎం గోడౌన్ తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ తనిఖీలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.






