17 July, 2026 | 7:30 PM

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి

17-07-2026 07:30 PM

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు తంగళ్లపల్లి సర్పంచుల వినతి

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ మండల సర్పంచుల ఫోరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించింది. గ్రామ పంచాయతీల సీసీ/పీపీ చార్జీలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు లేదా ప్రత్యేక నిధుల ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయడం, ఇంటి పర్మిషన్‌లు, మ్యుటేషన్లకు సంబంధించిన బకాయిలు చెల్లించడం, ఇంటి పన్ను ద్వారా వచ్చే నిధుల వినియోగానికి వెసులుబాటు కల్పించడం, సీవరేజ్ నిధులను విడుదల చేయడం ద్వారా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని తంగళ్లపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మని రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.