మాలల రాజ్యాంగ కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలి
- ఈనెల 19న లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా
- జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ చైర్ పర్సన్ సుదమల్ల అంజలి
ముషీరాబాద్, జూలై 17(విజయక్రాంతి): మాలల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలని జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ పై ఈ నెల19న ట్యాంక్ బండ్లోని బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ చైర్పర్సన్ సుదమల్ల అంజలి తెలిపారు. ఈ మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను అశాస్త్రీయంగా వర్గీకరించి మాలలను ఇతర 26 ఉపకులాలతో కలిసి గ్రూప్-IIIలో చేర్చి 5 శాతం రిజర్వేషన్ మాత్రమే కేటాయించారని ఆరోపించారు. రోస్టర్ పాయింట్లలో మాలలకు 22వ స్థానం కేటాయించడం వల్ల తెలంగాణలోని మాల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు తగిన స్థాయిలో ఉద్యోగాలు లభించలేదని, 5 శాతం రిజర్వేషన్ కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని వారు పేర్కొన్నారు. రోస్టర్ విధానాన్ని సవరించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల19న జరిగే మాలల మహా ధర్నాలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






