విభజనవాదులకు ఫలితాలు ఓ గుణపాఠం
- సీఎంలు స్టాలిన్, రేవంత్‌లకు బుద్ధిచెప్పిన ప్రజలు
- బీజేపీ కార్యకర్తల పోరాటాల వల్ల బంగాల్‌లో అధికారం
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారం ఖాయం
- బీఆర్‌ఎస్ నేతలపై ప్రజలు నవ్వుకుంటున్నారు
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
కరీంనగర్, మే 4 (విజయక్రాంతి): ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్ల కు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే పశ్చిమ బంగాల్‌లో అధికారం దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని అన్నారు. సోమవారం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్‌లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పీఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడారు.
వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వారికి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జువెలర్స్ దోపిడీపై బీఆర్‌ఎస్ పార్టీ ఇష్ఠారీతిన మాట్లాడడం తగదన్నారు. పీఎంజే దోపిడీ ఘటనకు మాకేం సంబంధం? బీఆర్‌ఎస్ నేతల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. దొంగతనం చేసే వాడికి పక్కన మంత్రి ఇల్లుందా? అని చూస్తారా? అదే నిజమైతే వాళ్లు ఎమ్మెల్యే ఇంటి మీదుగానే జువెలరీ షాప్ వద్దకు వచ్చారని ఘటన జరిగిన సమీపంలో జిల్లా కోర్టు కూడా ఉందని, అంత మాత్రాన వాళ్లకు అంటగడతామా? ఇదేం పద్దతి? అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు.
జరిగిన ఘటనపై డీజీపీతో మాట్లాడానని హైదరాబాద్ నుంచి బృం దాలు వచ్చాయని దుండుగలను పట్టుకుంటామని చెబుతున్నారని అన్నారు. అయితే జరిగిన ఘటనను పరిశీలిస్తే.. భద్రతా వైఫల్యం కన్పిస్తోందన్నారు. ఇందులో సం దేహం లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి నేను రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నేతలు చెప్పడం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారని దేశంలో శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదని ఆ మాత్రం కూడా తెలియని వాళ్లను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న హుజూరాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలని బండి సంజయ్ అన్నారు.
రేవంత్, కేటీఆర్ చీకటి దోస్తులు..
సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదని తెలంగాణ లూటర్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ సొమ్మును దోచుకుని ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ తీరు ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే రాహుల్ గాంధీ పప్పుసుద్దేనా? అని చురకలంటించారు. బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజ యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పీఎం మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నా యకత్వంలో సాధించిన విజయమని చెప్పా రు.
అభివృద్ధి, జాతీయవాదానికి ప్రజలు పట్టం కట్టారని, దేశమంతా కాషాయగాలి వీస్తోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఆధారాలు బయటపెట్టకుంటే బతుకు బజారు కీడుస్తా అంటూ బండి మండిపడ్డారు. రేవంత్, కేటీఆర్‌లే చీకటి దోస్తులని పేర్కొన్నారు. తెలంగాణకు కాషాయ గాలి తాకబో తుందని బండి సంజయ్ అన్నారు.






