కొనసాగుతున్న రేషన్ పంపిణీ ప్రక్రియ
జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్
సికింద్రాబాద్, ఏప్రిల్12 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో మూడు నెలల పాటు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మొత్తం 8,40,345 రేషన్ కార్డులలో, సుమారు 4,21,868 కార్డులు ఆన్లైన్ ద్వారా సరుకులు పొందటంతో 50 శాతం పైగా పంపిణీ నమోదయినట్లు తెలిపారు.
పోర్టబిలిటీ (వన్ నేషన్,వన్ రేషన్ కార్డ్) సౌకర్యం ద్వారా లబ్ధిదారులు సులభంగా రేషన్ పొందుతున్నారని, పంపిణీని 30 రోజుల పాటు విస్తరించి నిర్వహించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా సజావుగా జరుగుతోందని, ఈ నెలాఖరు నాటికి రేషన్ పంపిణీ పూర్తవుతుందని, కార్డుదారులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని,పౌర సరఫరా అధికారులు, సిబ్బంది పారదర్శకత, సమర్థవంతమైన పంపిణీ పై దృష్టి సారిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.




