6 April, 2026 | 3:48 AM

గుప్పుమంటున్న గుడుంబా

06-04-2026 12:30 AM

పట్టించుకోని అధికారులు

నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత

చిన్న వయస్సులోనే వితంతువులుగా మారుతున్న మహిళలు

చితికిపోతున్న కుటుంబాలు

మంగపేట, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఏటూరునాగారం సబ్ డివిజన్ లోని  పలు గ్రామాలలో గుడుంబా గుప్పుమంటుంది. గుడుంబాను అరికట్టాల్సిన అధికారుల తీరు గమ్మత్తుగా ఉండడంతో పల్లెల్లో గుడుంబా ఏరులై పారుతుంది. ఏటూరునాగారం సబ్ డివిజన్ లోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం ( నూగూరు ) మండలాలలోని పలు గ్రామాలలో విచ్చల విడిగా గుడుంబా తయారీ, గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయి. పల్లెల్లో గుడుంబాను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే గుడుంబా తయారీ కాకుండా చూడాల్సిన ఆబ్కారీ అధికారులు నిర్లక్ష్యంగా,  మామూలుగా  చూసీ చూడనట్లు ఉండడంతో గుడుంబా రహిత రాష్ట్రంగా ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నీరు గారుతుంది.

కుటీర పరిశ్రమగా గుడుంబా తయారీ 

గుడుంబా తయారీకి కావాల్సిన బెల్లం, పటికలను ఆయా మండలాలలో కొంతమంది రహస్యంగా గ్రామాలలో సరఫరా చేస్తుండడంతో గ్రామాలలో గుడుంబా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. బెల్లం, పటిక విరివిగా దొరకడంతో ఇండ్ల ఆవరణలో, ఇంటి పరిసర ప్రాంతాలలో గుడుంబా తయారీ చేస్తే అధికారులు దాడులు చేసినప్పుడు దొరికిపోతామని గోదావరి తీర ప్రాంతాలలో, సమీప అటవీ ప్రాంతాలలో డ్రమ్ములలో బెల్లం పానకం నిల్వలు చేసి, అక్కడే రహస్యంగా గుడుంబా తయారీ చేసి కొంతమంది ఏజెంట్ల ద్వారా గ్రామాలలో గుడుంబా విక్రయదారుల ఇండ్ల వద్దకే పంపిస్తున్నారు. మరి కొంతమంది తమ ఇండ్లలోనే గుడుంబా తయారీ చేస్తున్నారు.

గుడుంబా తయారీ, విక్రయాలు జరిపే వారు స్వంత ధనార్జన వలన కొన్ని వందల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. గుడుంబా త్రాగి త్రాగి కుటుంబ యజమాని చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు చీకట్లోనే మగ్గుతున్నాయి.

రహస్యంగా బెల్లం, పటిక సరఫరా 

గుడుంబా తయారీకి ముడి సరుకుగా ఉపయోగించే బెల్లం, పటిక వరంగల్ నుండి ఒకటి, రెండు ట్రాన్స్ పోర్ట్ వాహనాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాల నుండి కూడా పలు మార్గాలు, పలు పద్దతులలో రహస్యంగా రవాణా అవుతుందనేది బహిరంగ రహస్యమే. ఇలా రవాణా చేస్తుండగా గతంలో పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గుడుంబా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం గుడుంబా తమారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఆటోలు, సబ్సిడీ రుణాలు అందిస్తుండగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన వారిలో కూడా కొంత మంది మళ్ళీ గుడుంబా తయారు చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

అధికారుల తీరుపై విమర్శలు 

గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది నామ మాత్రంగా తమ విధులను నిర్వహిస్తుండడంతోనే పల్లెల్లో గుడుంబా ఏరులై పారుతుందని విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా పెద్ద మొత్తంలో గుడుంబా తయారీ చేసే వారు కొంతమంది అధికారులకు నెలవారీ ముడుపులు ముట్ట చెప్పడంతో గుడుంబా తయారీ, విక్రయాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి.

గుడుంబా తయారీ కేంద్రాలపై అడపా దడపా దాడులు చేసి, నామ మాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపు కుంటున్నారే కానీ పూర్తి స్థాయిలో గుడుంబా తయారిని అరికట్టలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. గుడుంబా తయారీ, విక్రయదారులపై కేసులు పెట్టి వదిలేయడమే కాకుండా గుడుంబా తయారీ చేసే కుటుంబాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తే గ్రామీణ ప్రాంతాలలో గుడుంబా తయారీ, విక్రయాలను కొంతమేర నియంత్రించే అవకాశం ఉంది.

గుడుంబా అమ్మకాలను నిలిపివేయాలి  గుగ్గిళ్ళ సురేష్  ఎం.ఆర్.పీ.ఎస్ నాయకులు  

గుడుంబా వ్యసనానికి బానిసైన యువత నిండు జీవితాలను నాశనం చేసుకుంటుంది. గ్రామాలలో వాడ వాడలా గుడుంబా విచ్చలవిడిగా తయారీ చేయడం, గల్లీ గల్లీలో గుడుంబా దొరకడంతో మందు బాబులు గుడుంబాకు అలవాటు పడుతున్నారు. గుడుంబా మత్తులో పడ్డవారు తమ జీవితాలను నాశనం చేసుకుని మృత్యువాత పడుతుండడంతో ఆ కుటుంబాలలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.

గుడుంబా వ్యసవానికి బానిసై చిన్న వయస్సులోనే యువకులు చనిపోవడంతో గుడుంబా వ్యసనంతో భర్త చనిపోవడంతో చిన్న వయస్సులోనే వితంతువులు అవుతున్న మహిళలు ఎందరో ఉన్నారు. కుటుంబాన్ని పోషించే యజమాని గుడుంబా మహమ్మారికి బలికావడంతో కుటుంబ పోషణ భారమై చాలా కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఇప్పటికైనా సంబందిత అధికారులు  స్పందించి గుడుంబా తయారీ, విక్రయాలు, గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక విక్రయాలను అరికట్టాలి.