కుసుమ సోలార్ విద్యుత్‌పై అవగాహన సదస్సు
చిట్యాల, మే 7 : చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి రైతు వేదికలో 99 రోజుల ప్రభుత్వ ప్రగతి ప్రణాళికలో భాగంగా కుసుమ సోలార్ విద్యుత్ పథకంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సోలార్ విద్యుత్ వినియోగంపై వివరాలు తెలియజేశారు. రైతులు సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుందని, అలాగే రైతులు నేరుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తి చేసే విద్యుత్ను విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తాయని అధికారులు తెలిపారు.
దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. సర్పంచులు మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు అధికంగా వస్తున్న విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ వినియోగం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ భూముల్లో లేదా ప్రభుత్వ స్థలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, గుండ్రంపల్లి సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న, బొంతల చంద్రారెడ్డి, కట్ట ఆశయ శ్యామ్, అందే రాములు, విద్యుత్ శాఖ ఏఈ, వ్యవసాయ శాఖ ఏవో గిరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, రైతులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.






