27 March, 2026 | 4:07 AM

అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం పెరగాలి

27-03-2026 12:45 AM

ఐటిసి పరిశ్రమ ఆధ్వర్యంలోకంప్యూటర్లు, ఆటోల పంపిణీ

అమీన్పూర్, మార్చి 26 : పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత నిధుల ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి మరింత సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ పరిధిలో ఐటీసీ పరిశ్రమ సౌజన్యంతో రూ.32 లక్షలతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, చెత్త సేకరణ ఆటోలు, త్రీ చక్ర సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొల్లారం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలకు 15 కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రి చక్ర సైకిళ్లను లను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి, బొల్లారం డివిజన్ పరిధిలో పారిశుధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిఐ రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఐటీసీ సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ప్లాంట్ హెడ్ సుబ్రహ్మణ్యం, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.