7 May, 2026 | 3:12 AM

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి

07-05-2026 12:00 AM

తెలంగాణ జాగృతి డిమాండ్

మొయినాబాద్, మే 6 (విజయ క్రాంతి): పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు కె. శివశంకర్ మాట్లాడుతూ, 2014లో మహబూబ్నగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అప్పటి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

అయితే, 12 సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించినప్పటికీ, ఈ కీలక అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన తెలిపారు.

ఈ నెల 10న వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో, ముందుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని, ఆ తర్వాతే తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

మొయినాబాద్ మండల అధ్యక్షుడు సంగారి నాగేశ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల అభివృద్ధికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.