11 August, 2026 | 4:50 AM

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

11-08-2026 12:04 AM

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ రూరల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి, పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు సమానంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.