2 June, 2026 | 4:39 AM

బాబాయ్ ఇంటికి కన్నం వేసిన అబ్బాయి

02-06-2026 12:09 AM

సుపారీ ఇచ్చి చోరీ చేయించిన ఘనుడు

వారం రోజుల్లోనే చోరీ కేసును చేదించిన ఆర్మూర్ పోలీసులు

ప్రధాన నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్

అర్మూర్, జూన్ 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గత నెల 24న జరిగిన భారీ చోరీ కేసును వారం రోజుల్లోనే చేదించి నిందితులను అరెస్టు చేశారు. బాబాయ్ ఇంట్లోనే అబ్బాయి దొంగతనం చేయించడం విశేషం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే ఆర్మూరు పట్టణంలోని మహాలక్ష్మి కాలనీకి చెందిన మార్వాడి వ్యాపారి శరత్ అగర్వాల్ కుటుంబ సమేతంగా వేములవాడ దేవస్థానానికి దర్శనం కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు.

అదే రోజు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ. 40 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు నగదు చోరీ చేసినట్లు వెల్లడించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సోమవారం పట్టణ శివారులోని బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించగా వారిని పట్టుకుని విచారించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారం, వెండి, నగదు లభించినట్లు పేర్కొన్నారు. వారిని విచారించగా దొంగతనం బయటపడినట్లు వెల్లడించారు.

ఈ దొంగతనానికి సొంత అన్న కొడుకు విజయ్ అగర్వాల్ అనే వ్యక్తి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చి దొంగతనం చేయించినట్లు వెల్లడించారు. విజయ్ అగర్వాల్ తన పరిచయమున్న వ్యక్తులతో దొంగతనం చేయించినట్లు సిపి వెల్లడించారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన సల్మాన్ ఖాన్ అలియాస్ కలీం లల్లాతోపాటు అదే ప్రాంతం లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన మంజుల సాయికుమార్, శ్రీహరి అనే వ్యక్తుల ద్వారా తన బాబాయ్  ఇంట్లో చోరీకి ప్లాన్ చేయించాడు.

అందుకుగాను ముగ్గురికి కొంత నగదు ముట్టజెప్పి దోచుకున్న సొమ్మును పంచుకోవాలని పథకం రచించాడు. గత నెల 24న బాబాయ్ ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా వేములవాడకు వెళ్లగా, అదే రోజు 41 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు నగదు చోరీకి పాల్పడ్డారు.  అందులో శ్రీహరి అనే వ్యక్తి ఎనిమిది లక్షల నగదును తీసుకొని పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన 31 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు 19 లక్షల నగదును సీజ్ చేసినట్లు సిపి వెల్లడించారు.

ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్, సల్మాన్ ఖాన్, సాయికుమార్ లను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు సిపి వివరించారు. ఈ కేసును వారంలో రోజుల్లోనే చేదించిన ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్ హేచ్ ఓ సత్యనారాయణ గౌడ్, సిసిఎస్ సీఐ సాయినాథ్ వారి బృందాలను సిపి సాయి చైతన్య అభినందించారు. బాబాయ్ శరత్ అగర్వాల్ ఇంట్లో చోరీకి పాల్పడిన అబ్బాయి విజయ్ అగర్వాల్ పై గతంలో ఏడు కేసులు ఉండడంతో అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు.