మార్కెటింగ్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దాలి
- వ్యవసాయ మార్కెట్లలో పూర్తి స్థాయి డిజిటలీకరణకు చర్యలు
- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మార్కెటింగ్ శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, డిజిటలీకరణ, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, మార్కెట్ యార్డులలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బృందాల తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని ఆదేశించారు.
ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. పత్తి కనీస మద్దతు ధర ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీ తయారుచేసిన డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి, సీఎం అనుమతితో వచ్చే నెలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఎక్కడ సిబ్బంది కొరత ఉందో వెంటనే గుర్తించి, అదనపు పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
కాగా వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాంభరెడ్డి సచివాయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు సకాలంలో అందుబాటులో ఉండేలా కంపెనీలను ఆదేశించాలని, అవసరమైన ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రిని ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా తక్కువ ధరలకు సరఫరా చేయాలని కోరారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.






