వచ్చాడు మరో బల్లెం వీరుడు
- యశ్వీర్ సింగ్ సంచలన ప్రదర్శన
- వెదురు కర్రలతో ప్రాక్టీస్
- కామన్‌వెల్త్‌గేమ్స్‌లో కాంస్యం
గ్లాస్గో, ఆగస్టు 1 : మన దేశంలో జావెలిన్ త్రో అనగానే నీరజ్ చోప్రానే గుర్తొస్తాడు. ఒలింపిక్ మెడల్‌తో ఎంతోమందికి నీరజ్ స్ఫూర్తిగా నిలిచాడు. అత ను తెచ్చిన ఒలింపిక్ విజయంతో చాలా మంది జావెలిన్ వైపు అడుగులు వేశారు. అదే సమయంలో నీరజ్ చోప్రా తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడిప్పుడే జవాబు దొరికే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా గ్లాస్గో గేమ్స్ వేదికగా నీరజ్ చోప్రా రజతం సాధిస్తే , మరో బల్లెం వీరుడు యశ్వీర్ సింగ్ సంచలన ప్రదర్శనతో కాంస్యం గెలిచాడు.
దీంతో యశ్వీర్ సింగ్ ఎ వరా అంటూ క్రీడాభిమానులు తెగ ఆరా తీస్తున్నా రు. ఈ విజయం తర్వాత సోషల్ మీడియాలో అతని గురించే చర్చ జరిగింది. ఈ క్రమంలో యశ్వీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జైపూర్‌కు చెందిన యశ్వీర్ చిన్నతనంలో ఫిట్‌నెస్ కోసం బాస్కెట్‌బాల్ ఆడేవాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో జావెలిన్ క్రీడకు మారిపోయాడు. ఆరంభంలో వెదురుబొంగు కర్రలతో ప్రాక్టీస్ చేసేవాడు. ప్రొఫెషనల్‌గా మారే ముందు వరకూ అతను వాటితోనే ప్రాక్టీస్ చేశాడు.
తన తండ్రి రాయ్ సింగ్ కూడా జాతీయ స్థాయి జావెలిన్ త్రో అథ్లెట్. ఆయన మార్గదర్శకంలోనే యశ్వీర్ మెలకువలు నేర్చుకున్నాడు.యశ్వీర్ అండర్ 20 ఫెడరేషన్ కప్‌లో నీరజ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. 2022లో 80 మీటర్ల మార్క్ అందుకున్నాడు. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 82.57 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా కామన్‌వెల్త్ గేమ్స్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు.
ఇది అతని కెరీర్ బెస్ట్ త్రో. వచ్చే లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో నీరజ్‌తో పాటు యశ్వీర్‌పై కూడా అంచనాలున్నాయి. కాగా తాజా విజయంపై యశ్వీర్ సింగ్ తండ్రి రాయ్ స్పందించారు. కఠిన శ్రమ ఎప్పుడూ ఫలితాలను ఇస్తుందనీ, తమ శిక్షణలో ప్రత్యేకత ఏం లేదన్నారు. కానీ ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసేవాళ్లమని వెల్లడించారు. తాను అథ్లెట్‌గా ఉన్నప్పుడు చాలా పొరపాట్లు చేశాననీ, కానీ తన కుమారుడి విషయంలో అలా చేయకుండా ఉండేందుకు శిక్షణనిచ్చానని రాయ్ తెలిపారు.






