2 August, 2026 | 2:27 AM

ఆగస్ట్.. విజువల్ ఫీస్ట్!

02-08-2026 01:05 AM
  1. నెలాఖరు వరకు థియేటర్ల వద్ద జాతరే.. 
  2. క్రేజీ చిత్రాల రిలీజ్‌లు, స్టార్ల అప్డేట్స్ ఈ మాసంలోనే 

ఆగస్టు నెల వచ్చేసిందంటే చాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక రకమైన సందడి మొదలవుతుంది. టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాలుగా నిలిచిన ఎన్నో చిత్రాలు ఈ నెలలోనే విడుదలయ్యా యి. అందుకే ఈ నెలను ఇండస్ట్రీ సెంటిమెంట్ నెలగా భావిస్తుం ది. వెండితెరపై ప్రతి నెలా సరికొత్త చిత్రాలు సందడి చేయడం సహజం. అయితే, ఈ ఏడాది ఆగస్టు మాసం ఇంకాస్త ప్రత్యేకంగా మారనుంది.

సినిమా ప్రియులకు ఒక పెద్ద వినోదాల పండగలా మారబోతోందీ నెల. చిన్న చిత్రాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టుల వరకు డజన్ల కొద్దీ సినిమాలు ఈ నెలలో థియేటర్లలోకి రానున్నాయి. పలు భారీ చిత్రాల అప్‌డేట్స్ కూడా ఇదే నెలలో రానున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఉన్న నెల కావడంతో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆగస్టు నెలలో స్టార్ హీరోల చిత్రాలతోపాటు, మిడ్ రేంజ్ హీరోలు, వినూత్న ప్రయోగాత్మక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఒక్క నెలలోనే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నుంచి దాదాపు 25కు పైగా భారీ చిత్రాలు, విభిన్న కథాంశాలు థియేటర్లలో విడుదలవడానికి సిద్ధంగా ఉన్నాయి.

వరమహాలక్ష్మి పండుగ, రక్షాబంధన్ వంటి వరుస సెలవుల వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేందుకు ఈ నెల సినీ పరిశ్రమకు ఒక పెద్ద పండుగ లాంటిది. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ (ఆగస్టు 15) వారాంతాన్ని టార్గెట్ చేస్తూ భారీ చిత్రాలు పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. 

టాలీవుడ్.. బాలీవుడ్.. హాలీవుడ్.. 

‘టాక్సిక్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘ఇరుముడి’ వంటి భారీ అంచనాలున్న దక్షిణాది క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. హిందీ బెల్ట్ నుంచి ‘ఆవారాపన్ 2’, ‘బట్వారా 1947’, ‘ఖోస్లా కా ఘోస్లా 2’ వంటి సీక్వెల్స్, పీరియాడిక్ డ్రామాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించనున్నాయి. ఇంటర్నేషనల్ సినిమాను ఇష్టపడే వారి కోసం హాలీవుడ్ హారర్, థ్రిల్లర్స్ సిద్ధంగా ఉన్నాయి. హారర్ ఫ్రాంచైజీ ‘ఇన్సిడియస్’, సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ది డాగ్ స్టార్స్’ వంటి చిత్రాలు కూడా ఈ నెలలోనే ఇండియాలో విడుదలవుతున్నాయి.  

విభిన్న జోనర్లు.. 

ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే లక్ష్యంగా వేర్వేరు జానర్లలో క్రేజీ చిత్రాలు విడుదల కానున్నాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, క్యూట్ లవ్ స్టోరీస్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ నెల టాలీవుడ్ లైనప్ సిద్ధమైంది. ఆగస్టు 21న రవితేజ వర్సెస్ నానిగా మారనుంది. ఈ ఒకే రోజు మాస్ మహారాజ రవితేజ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’.. అటు నేచురల్ స్టార్ నాని మోస్ట్ యాంటిసిపేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ చిత్రాలు ఒకే రోజు పొటీపడుతుండటం విశేషం.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ‘జడల్ జమానా’ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు.  

బ్లడ్‌ఫీస్ట్ థీమ్‌తో ‘భోగి’:  మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘బ్లడ్‌ఫీస్ట్’ థీమ్‌తో రాబోతున్న ఈ పక్కా కమర్షియల్ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలో సందడి చేయనుంది. 

గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ‘టాక్సిక్’:  కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’. ఈ చిత్రం కూడా ఈ ఆగస్టు చివరి వారంలోనే (ఆగస్టు 26న) విడుదలకు సిద్ధమవుతోంది. 

ఇండో హారర్ కామెడీతో వరుణ్: వరుణ్ తేజ్ నటిస్తున్న డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రితికా నాయక్, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న రిలీజ్ కానుంది.

‘డీసీ’తో హీరోగా మారిన క్రేజీ డైరెక్టర్:  కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా మారి నటించిన సరికొత్త చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఆగస్టు 7నే వరుణ్ తేజ్ సినిమాకు గట్టి పోటీగా బరిలోకి దిగుతోంది. 

నయనతార రొమాంటిక్ మూవీ.. హాయ్:  యంగ్ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో విష్ణు ఎడవన్ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ ‘హాయ్’. ఈ చిత్రం కూడా సూర్య సినిమాతో సమానంగా ఆగస్టు 14నే విడుదలవుతోంది.

‘పళ్ల బురుసు’తో వస్తున్న స్టార్ ఆర్టిస్టులు: బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సుధాకర్‌రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పళ్లబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. 

మరికొన్ని సినిమాలు: ఆగస్టు 7వ తేదీన విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన ‘అనకాపల్లి’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన కీలక పాత్ర పోషించడమే కాకుండా, భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడితో కలిసి నిర్మించారు.

సీనియర్ దర్శకుడు ఎంఎస్ రాజు రూపొందించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. ఇందులో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవీకా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్ శ్రేయ రాణి రెడ్డి కీలక పాత్రలో నటించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న విడుదల కాబోతుంది.

అన్షు, వాసవి గణేశన్ జంటగా భిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ‘హుషారు పిట్టలు’ చిత్రాన్ని రుద్ర క్రాంతి పిక్చర్స్ నిర్మించారు. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తోంది. ఇంకా విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగష్టు 14, ఐమ్ గేమ్ (తెలుగు డబ్) ఆగష్టు 20న, ఖలీఫా (తెలుగు డబ్) ఆగష్టు 20,  ఈత (హిందీ చిత్రం) ఆగష్టు 28న విడుదల కానున్నాయి. 

 నరేశ్ ఆరుట్ల