మీ సేవల్లో మైలురాయి
- ఒక్క రోజులోనే 2 లక్షలకు పైగా లావాదేవీలు
- దేశంలోనే నంబర్ వన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం
- ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థపై నమ్మకం పెరిగింది
- ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ప్రభుత్వ సేవలు, లావాదేవీలను ఆన్‌లైన్‌లో ఒకే వేదిక మీద అందిస్తున్న ‘మీ సేవ’మరొక రికార్డును నమోదు చేసిం ది. శుక్రవారం ఒక్క రోజే 2,20,172 లావాదేవీలు జరిగాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మీసేవ డిజిటల్ ఫ్లాట్ ఫాంను మరింతగా అభివృద్ధి చేయటం, సేవలను విస్తృత పరచటం, ఆ మేరకు ప్రజల వాడకాన్ని ప్రోత్సహించటంలో ప్రజాప్రభుత్వం చొరవ చూపిస్తుందని, దీంతో కొత్త రికార్డు లు నమోదవుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర పౌరులకు వేగంగా, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు మీసేవ వేదికను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తుందన్నారు. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో ఎలాంటి అవాంతరాలు లేని లావాదేవీల ద్వారా దేశంలోనే నంబర్ వన్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌గా ‘మీ సేవ’ వ్యవస్థ నిలిచిందని స్పష్టం చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా రోజూ సరాసరి 70 నుంచి 80 వేల కార్యకలాపాలు మీసేవ కేంద్రాల ద్వారా నమోదవుతాయి.
శుక్రవారం ఒకే రోజు 2.20 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటిలో ప్రభుత్వం కొత్త గా తీసుకువచ్చిన ఫ్యామిలీ కార్డు, రవాణాశాఖ, ఆదాయ ధృవీకరణ పత్రాల అప్లికేషన్లు మొదటి మూ డు స్థానాల్లో నిలిచాయి. ఈ ఘనత తెలంగాణ ప్రభు త్వ డిజిటల్ సేవల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న విశ్వాసానికి నిదర్శనం’ అని మంత్రి ప్రకటించారు.
పనితీ రును మెరుగుపరచడం, సేవల లభ్యతను విస్తరించడం, కొత్త పౌర సేవలను అందుబాటులోకి తీసుకు రావడం, సాంకేతిక, మౌలిక వసతులను బలోపేతం చేయడం లాంటి చర్యల ఫలితంగానే ఈ మైలురాయి సాధ్యమైందని తెలిపారు.
నిర్వాహకులు, సాంకేతిక బృందాలకు మంత్రి కృతజ్ఞతలు
రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు సేవలను అందించడంలో విశేష కృషి చేసిన నిర్వాహకులు, సాంకేతిక బృందాలను మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు. మీసేవల ద్వారా ప్రస్తుతం ఫ్యామిలీ కార్డు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, వివిధ రిజిస్ట్రేషన్లు, ప్రభు త్వ యుటిలిటీ చెల్లింపుల వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితో పాటు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు సులభంగా అందుతున్నాయని చెప్పారు. ప్రజలకు అత్యుత్తమ సేవలలను అందిస్తామన్నారు.






