1 April, 2026 | 4:24 AM

మహిళలకు వరం.. మహాలక్ష్మి పథకం

01-04-2026 12:51 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరంలాంటిదని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా జిల్లాలో ఈనెల 29 నాటికి సుమారు రూ.77 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.

ఈ పథకం వల్ల చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారాలు చేసే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చెప్పారు.నిత్యం ప్రయాణించే మహిళలను శాలువాలతో సన్మానించగా, ఆర్టీసీ సిబ్బంది కలెక్టర్‌ను సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, ఆర్టీసీ సిబ్బంది, మహిళా ప్రయాణికులు, అధికారులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందజేత: పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన సిరిపురం ఈశ్వర్ ఉపాధి హామీ పనులు చేస్తూ మరణించిన ఘటనలో అతని భార్య సిరిపురం సంగీతకు రూ.2 లక్షల పరిహారం మంజూరు పత్రాలను కలెక్టర్ కె.హరిత అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తరావు పాల్గొన్నారు. 

ఇండ్ల గణన జాబితా పకడ్బందీగా చేపట్టాలి: మొదటి విడత ఇండ్ల గణన జాబితాను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అధికారులకు సూచించారు.కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్,  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీఓ లోకేశ్వర్రావుతో కలిసి చార్జ్ అధికారులు, ఫీల్ అధికారులు, సాంకేతిక సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీలలో ఏర్పాట్లు పూర్తి చేసి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలన్నారు.