2 March, 2026 | 3:48 AM

అలంపుర జీవనాడి ‘గడియారం’

02-03-2026 02:06 AM

6న రామకృష్ణశర్మ జయంతి :

‘పరమ పావని తుంగభద్ర స్రవంతియే పరుషమ్ములడగించు గంగాభవానీ.. భవ్య చౌషష్ఠి ఘట్ట సంభరిత మగుచూ తలప శ్రీగిరి పశ్చిమద్వారమగుచు వ్యాసముని సన్నుతికి పాత్రమైన భూమి భద్రగుణరాశి దక్షిణ వారణాశి’... అంటూ గడియారం 

రామకృష్ణ శర్మ అలంపుర జోగుళాంబను కొలిచారు. తెలుగు సాహిత్యంలో ఆయనది విశిష్ట అధ్యాయం. గ డియారం కేవలం ఒక కవి మాత్రమే కాదు. చరిత్ర అన్వేషకుడిగా, వాస్తు, శిల్పశాస్త్ర ప్రజ్ఞుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన విశేషమైన సేవలందించారు. తెలుగు భాషా సంస్కృతు లు అణచివేస్తున్న నిజాం నిరంకుశ పాలకులను నిలదీస్తూ తెలంగాణ గడ్డపై అక్షర చైతన్యాన్ని రగిలించిన చైతన్యశీలి.

ఆయన రాయలసీమ సీమలో జన్మించినప్పటికీ, తెలంగాణను తన కర్మభూమిగా మార్చుకున్నారు. అలంపుర క్షేత్ర ప్రాభవాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన పాండిత్యం కేవలం తాళపత్రాలకే పరిమితం కాకుండా, సమాజ హితం కోసం, మాతృభాష పరిరక్షణ కోసం నిరంతర కార్యశీలతతో సాగింది. గడియారం 1919 మార్చి 6న ఇప్పటి అనంతపురం జిల్లాలో జన్మించారు. జ్యోతిష్యశాస్త్ర పండితుడు జ్వాలాపతి శాస్త్రి ఆయన తండ్రి.

సుబ్బమ్మ తల్లి. ఆయన ప్రాథమిక విద్య కదిరిలోనే సాగింది. 1929లో తన 11వ ఏట ఆయన అలంపురానికి చేరుకున్నారు. ఆయన చదువుకున్నది కేవలం ఆరో తరగతి వరకే. అయినా.. ఆయనలోని జ్ఞాన తృష్ణ జ్ఞానాన్వేషిగా మార్చింది. తన చిన్నాన్న రామశర్మ వద్ద సంప్రదాయ విద్యను అభ్యసించిన గడియారం, తర్వాత వేలూరి శివరామ శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు.

ఆ శిష్యరికం తన జీవిత గమనాన్ని మార్చిందని గడియారం చెప్పుకొనేవారు. అక్కడ ఆయన కావ్య, నాటక, అలంకార శాస్త్రాలను అభ్యసించారు. ఆ జ్ఞాన సముపార్జనే భవిష్యత్తులో ఆయన అలంపుర క్షేత్ర చారిత్రక రహస్యాలను ఛేదించడానికి బలమైన ఆయుధమైంది.

అలంపుర క్షేత్ర వైతాళికుడు

అలంపుర క్షేత్రం జోగుళాంబ ఆలయ పునరుద్ధరణలో గడియారం పాత్ర అద్వితీ యం. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావించే అలంపుర వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి ఆయన పడిన తపన అనిర్వచనీయం. ‘అలంపుర క్షేత్ర మహత్మ్యం’, ‘దక్షిణ వారణాశి’, ‘జోగుళాంబ మహాశక్తి’ వంటి గ్రంథాల ద్వారా ఆ క్షేత్ర చారిత్రక ప్రాధాన్యతను భక్తులకు, పరిశోధకులకు కళ్లకు కట్టినట్లు వివరించారు.

దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ట్రస్టు బోర్డు అధ్యక్షుడిగా ఉండి, ఆలయాల సంరక్షణకు, శాసన పరిష్కారానికి అవిరళ కృషి చేశారు. కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆయన అక్కడి శిల్ప రీతులను, వాస్తు విశేషాలను వైజ్ఞానిక ప్రాతిపదికన విశ్లేషించారు. వాటిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ క్రమంలో ఆయన సాహితీ ప్రస్థానం అనేక పాయలుగా విస్తరించింది. 

సాహితీ పయనం

గడియారం తన 18వ ఏటలోనే ‘చంద్రహాసోపాఖ్యానం’ అనే పద్యకావ్యం రాశారు. కన్నడ నాట ప్రసిద్ధిగాంచిన ‘గదాయుద్ధ’ నాటకాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సైతం లభించింది. వాస్తు శాస్త్రంపై ఆయన రాసిన ‘మన వాస్తు సంపద’, ‘భారతీయ వాస్తు విజ్ఞానం’ వంటి గ్రంథాలు నేటికీ పరిశోధకులకు ప్రామాణికాధారాలు. తెలంగాణ శాసనాల పరిశోధనలో ఆయన చూపిన చొరవ, ముఖ్యంగా రెండో సంపుటి వెలువరించడంలో ఆయన చేసిన శ్రమ వెలకట్టలేనిది.

‘అలంపూరు శిథిలములు’, ‘అలంపూరు చరిత్ర’, ‘దక్షిణ వారణాసి’, ‘అలంపూరు మహాత్మ్యం’, ‘బీచుపల్లి క్షేత్ర చరిత్ర’, ‘ఉమామహేశ్వర క్షేత్ర చరిత్ర’, ‘అనిమెల సంగమేశ్వర చరిత్ర’, ‘శ్రీజోగుళాలాంబ మహాశక్తి’ గడియారం క్షేత్రచరిత్ర రచనలు. ‘భారత దేశ చరిత్ర, ప్రపంచ రాజ్యాలు’, ‘శ్రీనిత్యానంద స్వామి చరిత్ర’, ‘శ్రీమాధవి విద్యారణ్యస్వామి చరిత్ర’ రచనలు చరిత్ర, ఆయన జీవిత విశేషాలకు సంబంధిచినవి.

పాంచజన్యం (ఖండ కావ్య సంపుటి), దశరూపక సారం, తెలుగు సిరి (వ్యాసాలు) రచనలు సాహిత్యం, వాస్తు శాస్త్రానికి సంబంధించిన విశ్లేషణలు. ‘తెలంగాణా శాసనములు’, ‘వినయాదిత్యుని పల్లెపాడు తామ్ర శాసనం’, ‘కన్నడ సణ్ణ కథెగళు’ అనేవి గడియారం శాసన, పరిశోధన, అనువాద ప్రక్రియల రచనలు. ‘మంచన - కేయూర బాహు చరిత్ర’, ‘కొరవి గోపరాజు -సింహాసన ద్వాత్రింశిక’, ‘శ్రీ మదలంపూరీ క్షేత్ర మహాత్మ్యం (సంస్కృతం)’అనేవి ప్రాచీన గ్రంథ పరిష్కరణలు.

సామాజిక ఉద్యమాల్లోనూ

సాహితీ రంగంలోనే కాదు.. సామాజిక బాధ్యత నిర్వహణలోనూ గడియారం ముందంజలో ఉండేవారు. 1947లో ఆయన కర్నూలులో భాగ్యనగర్ రేడియో కేంద్రాన్ని స్థాపించి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వార్తలను, వ్యాఖ్యలను ప్రసారం చేశారు. పసుమాముల నృసింహశర్మ 1927లో నడిపిన సుజాత పత్రికను, గడియారం 1950లో స్వీకరించి, మూడు సంవత్సరాలు నడిపారు. 1943లో స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపక సభ్యుల్లో ఈయన ఒకరు.

ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ప్రచార కార్యదర్శిగా, పరీక్షల కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 1950 57 వరకు సహాయ కార్యదర్శిగా సేవలందించారు. సంఘ సంస్కరణలో భాగంగా మూఢాచారాలను ఎదిరించి, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంతేకాదు.. ఆయన స్వయంగా వితంతువు వివాహం చేసుకుని, సమాజానికి ఆదర్శంగా నిలిచారు. స్త్రీ విద్య కోసం ఆరోజుల్లోనే ఆయన అలంపురంలో ప్రత్యేక విద్యాసంస్థ నెలకొల్పారు.

ఆయన ఆత్మకథ ‘శతపత్రము’ ఒక వ్యక్తిగత జీవిత చిత్రణ మాత్రమే కాదు, అది గత శతాబ్దపు సామాజిక, రాజకీయ పరిణామాల సజీవ సాక్ష్యం. ఆ సాహితీమూర్తి 2006 జూలై 25న ఈ భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించారు. అయినప్పటికీ, తన అక్షర సంపద, అలంపుర క్షేత్ర వైభవం ద్వారా ఆయన తెలుగువారి స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచిపోతారు.

 జ్వలిత