అక్రమంగా పట్టా చేయించుకొన్న భూమిని రద్దు చేయాలి
కొడుకు, మనవడి నుండి ప్రాణ హాని ఉంది..
రక్షణ కల్పించి న్యాయం చేయండి.
విలేఖరుల సమావేశంలో బాధితులు శివలా, తులసీ బాయ్
కూసుమంచి, ఖమ్మం, జూలై 16(విజయక్రాంతి): అక్రమంగా తన పొలం పట్టా చేయించుకున్నారని, దాన్ని రద్దు చేయాలని, కొడుకు, మనవడి నుండి ప్రాణ హానీ ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు శివ లా వేడుకున్నాడు.
కూసుమంచి మండలం రావిచేట్టు తండా కు చెందిన శివలా తన కోడలు తేజావత్ తులసి బాయి తో కలిసి ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూసుమంచి రెవెన్యూ పరిధిలోని తమ వ్యవసాయ పొలంలో సాగు చేస్తుండగా తన కుమారులు కోడళ్ళు కలిసి నాపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని శివలా ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రాణ హానీ ఉందని రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.
తులసి బాయి మాట్లాడుతూ...గత నెల జూన్ 5న ఆదివారం సాయంత్రం 4:15 నిముషాలకు నా పొలంలో వరి నారుకు నీళ్లు పెట్టేందుకు వెళ్ళానని , అదే సమయంలో మా మామ చేనును ట్రాక్టర్ తో దున్నెందుకు మా బావ, ఆయన కుమారుడు వచ్చారని తెలిపారు. ఆ పొలాన్ని మా మామను భయపెట్టి బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. ఇది గ్రహించిన మా మామ ఆ పొలాన్ని నాకు కౌలుకు ఇచ్చారని, అతని బాగోగులు కూడా నేను ,నా కుమార్తెలు చూసుకుంటున్నామని తెలిపారు.
రెండేళ్ల క్రితం నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారని, నాకు అండదండలు ఎవరూ లేరని గ్రహించి, నాపై , ఆడపిల్లలపై దాడికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతూ రాళ్లతో కట్టెలతో గాయపరుస్తున్నారన్నారని, మీ అంతు చూస్తాం. నిన్ను చంపి అయినా సరే ఈ పొలాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.






