26 February, 2026 | 3:25 PM

చర్ల టు భద్రాచలం ప్రయాణం నరకమే

26-02-2026 12:04 AM

ఊరు దాటినా.. 

ఇల్లు చేరని ప్రాణాలు 

దుమ్ము ధూళి వలన

శ్వాసకోస వ్యాధులు 

బరితెగించిన ఇసుక రీచ్ నిర్వాహకులు 

చర్ల, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): చర్ల టూ భద్రాచలం రోడ్డు ప్రయాణం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఊరు దాటినా ఇల్లు చేరని ప్రాణాలు  అనే పరిస్థితి నెలకొంది. ఇసుక లారీల రాకపోకలతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇసుక లారీల అతివేగం, మితిమీరిన లోడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.

ముఖ్యంగా చర్ల - భద్రాచలం ప్రధాన రహదారి గుండా ఈ సమస్య తీవ్రంగా ఉంది. లారీల నుండి పడే ఇసుక వల్ల ద్విచక్ర వాహనదారులు జారిపడటం, దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్యలు, రోడ్లు దెబ్బతినడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు సర్వసాధారణంగా మారింది. ఈ మధ్యకాలంలో  ఇసుక లారీల వలన అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి, చర్ల మండలానికి చెందిన మహిళ దుమ్మగూడెం మండలంలోని ములకపాడు అడ్డరోడ్డు వద్ద లారీ ప్రమాదానికి గురై అతి ఘోరంగా చనిపోయింది, నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని స్పందన లేకపోవడం చాలా బాధాకరం. 

చీకటి పడిందంటే భద్రాచలం నుంచి చెర్ల వరకు వెళ్లాలన్న చర్ల నుంచి భద్రాచలం వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. దీంతో రోడ్డు ఎక్కిన వారు ఇంటికి చేరుకుంటేనే ప్రాణాలతో ఉన్నట్టు లెక్కనే భావించే పరిస్థితి నెలకొంది. చీకటి పడిందంటే ఇంటి  నుంచి బయటకు వెళ్లాలన్న బయట నుంచి ఊరికి రావాలన్న దూరం ఎక్కువ భారమైన పరిస్థితి మరో మార్గం కూడా లేదు అంటున్నారు.

చర్ల మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు పల్లె వాతావరణంతో పచ్చని పొలాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా వ్యవసాయం చేసుకుంటూ, జీవించే పల్లె ప్రజలకు ఇసుక రీచ్  నిర్వాహకులు ఊర్లను వల్లకాడుగా  మారుస్తున్నారు గోదావరి ప్రాంతాన ఉన్న పాపానికి ఆ ఊరి ప్రజలు ఇసుకరీచ్ నిర్వహణ దాష్టికానికి బలైపోతున్నారు. ఇసుఖ రవాణా చేస్తున్న లారీల హారన్ల మోతల తో పల్లెలు ఉలిక్కి పడుతుండగా, ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో వేసిన రోడ్డు ధ్వంసం అవుతున్నాయి.

ప్రమాదకరంగా మారిన రోడ్లపై జనం ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ ప్రయాణాలు చేస్తున్నారు. ఇసుక లారీల దుమ్ము దూళితో ఆ ఊరికి దారిని మూసేసినట్లుగా పరిస్థితి దాపరించడంతో మేము ఎలా బ్రతకాలి అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మునిపెన్నడూ లేని విధంగా ఇసుక ర్యాంపుల నిర్వాహకులు ధనార్జెనే ధ్యేయంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకొని గ్రూపులుగా ఏర్పరచుకొని, మహిళా సంఘాల ద్వారా ఊరికి ఒక ర్యాంపును సృష్టిస్తూ, గిరిజనుల మధ్య గిరిజన సంఘాల మధ్య మహిళా సంఘాల మధ్య చిచ్చులు పెడుతూ, వారి స్వలాభాల కోసం ర్యాంపులను సృష్టిస్తూ సహజ సంపదను దోచుకుంటున్నారు.

ఇసుక ర్యాంపుతో ధ్వంసమైన రోడ్లు, పచ్చని పొలాలు దుమ్ము కారణంగా దిగుబడి తగ్గి, రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్ల  నుండి ప్రయాణించిన మండల ప్రజలు ప్రమాదలకు గురవుతున్నారు కాగా కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు లేకపోలేదు. కొంతమంది గాయపడి అంగ వైకల్యంతో ప్రత్యక్ష సాక్షంగా మిగిలి ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు డిమాండ్ మేరకు నూతనంగా చర్ల మండలానికి భద్రాచలం ప్రాంతాల నుంచి 55 కిలోమీటర్ల పొడవునా ప్రభుత్వం లక్షలు వెచ్చించి చిన్న చిన్న మరమ్మత్తులు వేసింది రోడ్డు వేసిన మూడు నెలలు కూడా గడవకముందే ఇసుక లారీల రవాణాతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై ప్రమాదకరంగా మారింది.

దీంతో ఈ దారిపై ప్రయాణం చేసేది ఎలా అని ప్రజలు పాలకులను ప్రశ్నిస్తున్నారు. మా ఊరి నుంచి కోట్ల విలువ చేసే సహజ సంపదను దోసుకు వెళ్తున్న  నిర్వాహకులు ప్రజా ప్రభుత్వ ధనం తో నిర్మాణం చేసిన రోడ్డును సైతం  ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇసుక రీచ్ల్ల నుంచి ఇసుకను తరలించేందుకు  వచ్చే లారీలతో ప్రజలు బయట ప్రయాణం చేయాలంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.

గ్రామంలోనే కాదు గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి చెర్ల నుంచి భద్రాచలం వరకు రోడ్డు ఇరువైపులా లారీలు నిలిపి ఉండడంతో ఊరులోకి వెళ్లాలంటే దారిలేని పరిస్థితి నెలకొంది. ఇసుకచ్ నిర్వాహకులు ఇసుక లారీల కోసం వారికి స్థలాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అది విస్మరించడంతో ఇసుకను తగిలించేందుకు వచ్చే లారీలు అన్నీ కూడా రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఎదురుగా మరో వాహనం వస్తే ఇక ఆగిపోవాల్సిందే. అది ద్విచక్ర వాహనదారులు అయితే తమ వాహనాన్ని వదిలి రోడ్డు దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లారీలతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన చేసి అడ్డుకున్న ప్రజాప్రతినిధులు  ఇప్పుడు నోరు మెదపకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మరోవైపులారీలతో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు దృష్టికి తీసుకెళ్తే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంగా ఉండటమే మేము చేసుకున్న పాపమాని పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.