calender_icon.png 10 February, 2026 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమకు చిన్న సినిమాలూ అవసరం

10-02-2026 12:00:00 AM

శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీశ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. ఈ చిత్రంలో సీనియర్ నటులు అశోక్‌కుమార్, భద్రమ్, జెమిని సురేశ్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీవీకే తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మాతలు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను టీమ్ నిర్వహించింది.

ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్, యంగ్ హీరో అశ్విన్‌బాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మనం ఆస్కార్ రేంజ్ సినిమాలు చేస్తున్నాం. భారీ చిత్రాలతోపాటు చిన్న సినిమాలూ పరిశ్రమకు అవసరం. చిన్న సినిమాలతో పరిశ్రమలో అందరికీ ఉపాధి కల్పిస్తున్న వారు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అన్నారు.

చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ.. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌కు గ్యారెంటీ ఇస్తున్నాం’ అన్నారు. హీరోయిన్ సుప్రిత మాట్లాడుతూ.. ‘బయట ఎంత అల్లరిగా, సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అలాంటి క్యారెక్టర్ చేశా’ అని చెప్పారు. ‘మంచి కథతో చేసిన చిత్రమిద’ని మరో హీరోయిన్ ఎస్తేర్ తెలుపగా, ‘సినిమాలో మంచి కంటెంట్ ఉంద’ని ఇంకో హీరోయిన్ ధన్య బాలకృష్ణ చెప్పారు.

డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ.. “టైటిల్ చూసి పొలిటికల్ మూవీ అనుకుంటున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎంటర్‌టైన్ చేసే హారర్ థ్రిల్లర్ మూవీ ఇది” అని తెలిపారు. ‘మా హీరోయిన్స్ తమ అందంతోపాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటార’ని నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు చెప్పారు. మిగతా చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.