2 May, 2026 | 7:59 AM

గ్యాస్ ధర పెంపు సామాన్యుడిపై పెను భారం

02-05-2026 03:03 AM

పెంచిన ధరను ఉప సంహరించుకోవాలి 

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడమంటే సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమేనని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను రూ.993 పెంచడం చూస్తుంటే పేదల పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తున్నదని దుయ్యబట్టారు. ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం వరకు పెంచడంతో హోటళ్లు, కేఫ్‌లు రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపా రులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటలు పూర్తి కాగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ముమ్మాటికీ ఇది ప్రజలను మోసం చేసేందుకేనని విమర్శించారు. పెంచిన ధరతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.3 ,200కు మించి పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని చె ప్పారు. కేంద్రం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.