ఎల్లమ్మకు ఓకే..!
విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. రాక్‌స్ట్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమతున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయమై చాలా రోజులుగా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి.
తొలిసారి కథానాయకుడిగా తెరపై అలరించేందుకు సిద్ధమతున్న దేవిశ్రీకి ఎవరు హీరోయిన్‌గా సెట్ అవుతారనే విషయమై ఫిల్మ్ సర్కిళ్లలో చర్చలు జరిగాయి. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకూర్‌ల పేర్లు బాగా వినిపించాయి. తాజాగా యువ కథానాయిక అనంతిక సనీల్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ‘మ్యాడ్’లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ‘౮ వసంతాలు’తో మంచి పేరు తెచ్చుకుంది. ‘రోమాంచకం’ అంటూ త్వరలో సుమంత్ ప్రభాస్‌తో ప్రేక్ష కులను పలుకరించ నుంది. తాజాగా ఈ బ్యూటీని ‘ఎల్లమ్మ’ టీమ్ ఓకే చేసిందని, ఇటీవలే టెస్ట్ కట్ జరిగిందని సమాచారం.






