30 August, 2026 | 3:59 AM

ఆ నమ్మకంతోనే ఒప్పుకున్నా!

30-08-2026 12:46 AM

కోలీవుడ్ యువ కథానాయకుడు సూరి, టాలీవుడ్ స్టార్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మండాడి’. దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని పూర్తి సముద్రం నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మహిమా నంబియార్ తన రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “డైరెక్టర్ మతిమారన్ నాకు వీడియో కాల్‌లోనే కథ మొత్తం చెప్పారు. మొదట్లో కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయగలనా..? లేదా? అనే సందేహం వచ్చింది. దీంతో కొన్ని రోజులు ఆ భయంలోనే ఉండిపోయా. అయితే లుక్ టెస్ట్ చేసిన నాపై నాకు నమ్మకం పెరిగింది. ఆ లుక్ టెస్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలనని భావించి సినిమా ఒప్పుకున్నా” అని చెప్పుకొచ్చింది మహిమా.