10 April, 2026 | 1:46 AM

చేవెళ్ల ప్రజల ‘ఆరోగ్య’ స్వప్నం

10-04-2026 12:00 AM

శరవేగంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం

  50 మంది వర్కర్లు.. రెండు షిప్టులు 

ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్న ఎమ్మెల్యే

చేవెళ్ల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పర్యవేక్షణలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులు ఆసుపత్రి నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.

రెండు షిఫ్టుల్లో పని..

మొత్తం 50 మంది నైపుణ్యం గల కార్మికులు ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్విరామంగా పనిచేస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా పనులు ఆగకుండా ఉండేందుకు ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.

జి+3 (G+3) పద్ధతిలో నిర్మిస్తున్న ఈ భవనంలో మొదటి సెల్లార్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 49 పిల్లర్స్, 60 కాలమ్స్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ పూర్తి చేశారు.

విషాదం నింపిన మార్పు..

నిజానికి 2013 నుండే 50 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, గత ఏడాది మీర్జాగూడా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (19 మంది మృతి) ఈ ప్రాజెక్టు అవసరాన్ని నొక్కి చెప్పింది. దీంతో ప్రభుత్వం రూ. 17.50 కోట్ల నిధులు మంజూరు చేయడమే కాకుండా, పనుల్లో వేగాన్ని పెంచింది.

ఏడాదిలోగా అందుబాటులోకి..

‘ప్రజా ఆరోగ్యమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. గతంలో కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఏడాది కాలంలో ఈ 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.‘

 కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల