10 April, 2026 | 3:02 AM

కొత్తపల్లి రూట్లో కనుమరుగైన ఆర్టీసీ

10-04-2026 12:05 AM
  1. రెండేళ్లుగా విద్యార్థుల పాట్లు నిలిచిన మహబూబ్నగర్ కొత్తపల్లి బస్సు సౌకర్యం

కాలినడకన కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్న విద్యార్థులు

అధికారులు బస్సును పునరుద్ధరించాలని వేడుకలు 

నవాబ్ పేట ఏప్రిల్ 9 : గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చౌడాపూర్ మండలం లోని కన్మన్ కల్వ, కొత్తపల్లి, మరికల్ గ్రామాల ప్రజలు గత రెండేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మహబూబ్నగర్ నుండి కొత్తపల్లి గ్రామం వరకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిచిన ఆర్టీసీ బస్సు, గత రెండేళ్ల నుంచి రాకపోవడంతో ఈ మూడు గ్రామాల ప్రజలు రవాణా కష్టాల్లో కూరుకుపోయారు.

ఈ బస్సు నిలిచిపోవడం వల్ల ప్రధానంగా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవాబుపేట మండలం లోని ఎన్మనగండ్ల జూనియర్ కళాశాలకు వెళ్లే ఇంటర్ విద్యార్థులు, అలాగే మహబూబ్నగర్లోని ఎంవిఎస్ ,ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. బస్సు లేకపోవడంతో కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించాల్సి వస్తోందని, లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి హామీలు ఇచ్చే నాయకులు, గెలిచిన తర్వాత తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు వస్తుందని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని, అధికారుల్లో కదలిక లేదని స్థానికులు వాపోతున్నారు. వృద్ధులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా సరైన రవాణా మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు.    

గతంలో నడిచిన బస్సును ఎందుకు ఆపిండ్రు 

కొత్తగా ఎన్నికైన సర్పంచులం అంద రం కలిసి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. వెంటనే బస్సును పునరుద్ధరించాలి.గతంలో మా ఊరికి బస్సు రెగ్యుల ర్గా వచ్చేది. కానీ రెండేళ్లుగా ఊసే లేదు. కొత్తగా సర్పంచులుగా ఎన్నికైన మేము, మండలంలోని ఇతర సర్పంచులతో కలిసి జిల్లా ఆర్టీసీ అధికారులను కలిసి మొరపెట్టుకున్నాం. వినతి పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా అధికారుల నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు 

పండుగ కృష్ణవేణి, కన్మన్ కల్వ గ్రామ సర్పంచ్

సర్పంచుల వినతికి దక్కని ఫలితం

గ్రామాల్లో నెలకొన్న ఈ తీవ్ర రవాణా సమస్యను పరిష్కరించాలని కోరుతూ చౌడాపూర్ మండలంలోని కొత్తగా ఎన్నికైన సర్పంచులు పలుమార్లు ఆర్టీసీ అధికారులను కలిసి విన్నవించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి, బస్సును పునరుద్ధరించాలని వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ, అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. అధికారుల ఉదాసీన వైఖరిపై స్థానిక సర్పంచులు మరియు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సును పునరుద్ధరించాలి. 

జంబుల రజిత నరసింహులు, కొత్తపల్లి గ్రామ సర్పంచ్