2 March, 2026 | 5:20 AM

మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి

02-03-2026 12:02 AM

టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సదాశివపేట, మార్చి 1 : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యోద్దేశమని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం చందాపూర్ గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు, మహిళా సమాఖ్య భవనానికి, స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు.

అదేవిధంగా గ్రామంలో ఇటీవలే నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు అవకాశం కల్పించిందన్నారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు, మహిళా సంఘాలకు పక్కా భవనాలు, పెట్రోల్ బంక్ లను సైతం ఏర్పాటు చేసిందన్నారు.

భవిష్యత్తులో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించి మహిళలతో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇలా ప్రతీ విషయంలో మహిళల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, గ్రామ సర్పంచ్ పట్లోల్ల మల్లేష్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.