2 March, 2026 | 5:20 AM

పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్న ప్రభుత్వం

02-03-2026 12:00 AM
  1. రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
  2. అభివృద్ధి పనులకు శంకుస్థాపన  
  3. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి

వరంగల్, మార్చి 1(విజయ క్రాంతి): రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సాకారం చేస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివారం బల్దియా పరిధి 11 వ డివిజన్ లో మునిసిపల్ సాధారణ  నిధులు  కోటి రూపాయల  వ్యయం తో మఠ్వాడ ఈద్గా పునరుద్దరణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి   వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహాత్ బాజ్ పాయి, లతో కలసి  శంకుస్థాపన చేశారు.

వరంగల్ నగరంలోని ప్రముఖ కూడలి ఎం.జి.ఎం జంక్షన్ వద్ద రూ. 35 లక్షల వ్యయంతో నిర్మించిన తల్లి చేతి తొడుగులో శిశువు శిశు సంరక్షణ ప్రతిమను నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి  మంత్రి  ఆవిష్కరించారు.అదే విధంగా బల్దియా పరిధిలోని 40వ డివిజన్లో స్టాంప్ డ్యూటీ నిధులు రూ. 1.40 కోట్లు వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, ఉర్స్ స్మశానవాటిక, అసంపూర్తిగా ఉన్న గౌడ సంఘ భవనం మరియు మైనారిటీ కమ్యూనిటీ హాల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని జీడబ్ల్యూఎంసీ పరిధి 12వ, 33వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశాయిపేట్ తుమ్మలకుంట ప్రాంతానికి చెందిన లబ్ధిదారులు ఆడెపు కల్పనప్రవీణ్ కుమార్ దంపతులకు, పెరకవాడలోని నరహరిశెట్టి రమాదేవి కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటి పునాదిపై కొత్త ఆశలు నాటుకున్న ఈ క్షణాలు కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేశాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ మరియు తూర్పు నియోజకవర్గాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషకరమని,ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రజల ఇంటింట సౌభాగ్యాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన ఇండ్లు ఇప్పటికీ గ్రామాల్లో కనిపిస్తాయని, అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా గృహనిర్మాణ కార్యక్రమాలు జరిగాయని అన్నారు.

ఆ తర్వాత పేదల ఇళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదని, తిరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరుచేస్తున్నామని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.లబ్ధిదారుల ఎంపికపూర్తి పారదర్శకతపాటిస్తున్నామని, ప్రతి సోమవారం నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు.

తక్కువ స్థలం ఉన్న వారికి కూడా ఇల్లు మంజూరు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.సొంతిల్లు కేవలం గోడలు, పైకప్పు మాత్రమే కాకుండా భద్రత, గౌరవం, భవిష్యత్తుపై నమ్మకం అని మంత్రి తెలిపారు. మహిళలకు గృహ హక్కు కల్పించడం ద్వారా కుటుంబ స్థిరత్వం పెరుగుతుందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు మారుపల్ల రవి, ముష్కమల్ల అరుణ  సుధాకర్, ఉమా దామోదర్ యాదవ్, విజయలక్ష్మి సురేందర్,జిల్లా ఇంచార్జి హోసింగ్ పిడీ వాణిశ్రీ , డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, తహశీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.