ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ బి చంద్రకుమార్
ఎల్బీనగర్, మే 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన రబీ పంట సాగు కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని, ఇప్పటికే కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనకుండా తాత్సారం చేస్తుందని ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ బి చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం హస్తినాపురం సెంట్రల్ కాలనీలోని జస్టిస్ చంద్రకుమార్ నివాసంలో ఆయన మాట్లాడారు. ఓ వైపు రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు అకాల వర్షాలతో పంట మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు నీటిమీద అలలుగానే ఉన్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమైతే పూర్తిస్థాయిలో కల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లు చేయక, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లలోనే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రబీ పంటలో దాదాపు 92.17 లక్షలకుపైగా భూమిలో 1. 06 కోట్ల టన్నుల పంట దిగుబడి రాగా ప్రభుత్వం ఏ మేరకు కొనుగోలు చేసిందో లెక్కలు రైతుల ముందు ఉంచాలన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతో అనేకమంది రైతులు ధాన్యంతో తలదాచుకున్న చోటే ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎంతోపాటు మంత్రులకు అనేక విజ్ఞాపనలు చేసినా కొనుగోలు అంశం ముందుకు వెళ్లకపోవడం పరిపాలన స్థితిగతులకు అద్దం పడుతుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. గోదాములు, సంచులు, రవాణా వ్యవస్థ, మిల్లర్ల నిర్లక్ష్య వైఖరి అంశాలే రైతులకు నష్టం చేకూరుస్తున్నాయన్నారు.
రబీ పంటకోతకు ముందే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రను విడనాడి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చంద్రకుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంక్షేమ సమితి నాయకులు నైనాల గోవర్ధన్, మల్లాటి మల్లేశ్, పవన్ కల్యాణ్, సూర్యకిరణ్, ప్రభానంద్, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






