2 August, 2026 | 11:12 PM

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ మాన్యుఫ్యాక్చరర్స్ ఫోరమ్‌

02-08-2026 10:06 PM

హైదరాబాద్, ఆగస్టు 2026: రక్షణ తయారీకి సంబంధించి ప్రపంచ కేంద్రంగా మారాలన్న భారతదేశ లక్ష్యానికి మద్దతును అందిస్తూ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్‌లో 2వ డిఫెన్స్ ఎంఎస్ఎంఈ మాన్యుఫ్యాక్చరర్స్ ఫోరమ్ (డిఎంఎంఎఫ్)ను నిర్వహించింది.

"ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా: భారతదేశ రక్షణ & ఏరోస్పేస్ భవిష్యత్తు కోసం ఎంఎస్ఎంఈ లకు సాధికారత" అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సుకు సీనియర్ ప్రభుత్వ అధికారులు, విధాన రూపకర్తలు, డిపిఎస్యులు, ఓఈఎంలు, పారిశ్రామిక నాయకులు, స్టార్టప్‌లు మరియు ఎంఎస్ఎంఈ లు హాజరయ్యారు. వీరు భారతదేశ రక్షణ , ఏరోస్పేస్ తయారీ వాతావరణానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. 

స్వీయ సాధికారత, తయారీ, సాంకేతికతలకు భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా భారత రక్షణ పరిశ్రమ అపూర్వమైన వృద్ధి శకాన్ని చూస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ వస్తువుల ఉత్పత్తి రూ. 1.78 లక్షల కోట్లుగా ఉండగా, వాటి ఎగుమతి రూ. 38,000 కోట్లుగా నమోదైంది. భారతదేశ రక్షణ రాజధానిగా పరిగణించబడే హైదరాబాద్, ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.  ప్రముఖ ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, డిఆర్‌డిఓ ప్రయోగశాలలు, క్షిపణి, ఏరోస్పేస్ తయారీ కేంద్రాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, అధునాతన ఇంజనీరింగ్ సంస్థలు, వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత ఆధారిత ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల నెట్‌వర్క్‌కు ఈ నగరం నిలయంగా ఉంది.

ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య, ఐఏఎస్ తో పాటు, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఐసీసీ రక్షణ, ఏరోస్పేస్ & అంతరిక్షంపై జాతీయ నిపుణుల కమిటీ చైర్మన్ అయిన కమాండర్ పి. ఆర్. హరి, ఐఎన్ (రిటైర్డ్), ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విష్ణు మల్పాని; తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ పి.ఎ.; తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్య శాఖ డైరెక్టర్ శ్రీ నిఖిల్ చక్రవర్తి జె. (ఐఏ&ఏఎస్), డాక్టర్ ఎస్. వి. ఎస్. నారాయణ మూర్తి, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మిధాని మరియు డాక్టర్ రాజీవ్ సింగ్, డైరెక్టర్ జనరల్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్  వంటి అతిథులు ప్రసంగించారు.

ఈ సమావేశంలో, ఐసీసీ "ఎంఎస్ఎంఈలు -భారతదేశ రక్షణ వ్యవస్థకు ఒక శక్తి గుణకం - రెండవ ఎడిషన్" నివేదికను విడుదల చేసింది మరియు "దక్షిణ ప్రాంత రక్షణ ఛైర్" పరిచయాన్ని కూడా చేసింది. భారతదేశ రక్షణ , ఏరోస్పేస్ తయారీలో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు , ప్రభుత్వ అధికారుల మధ్య సహకారాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను ఈ ఫోరం నొక్కి చెప్పింది.