మంథని వాసికి అరుదైన గౌరవం
సమాజ సేవకు గుర్తింపుగా నల్మాసు ప్రభాకర్‌కు ‘వైశ్య వైభవ రత్న’ బిరుదు – స్వర్ణ కంకణంతో ఘన సత్కారం
మంథని, ఆగస్టు 2 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు, పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు నల్మాసు ప్రభాకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సమాజ సేవలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆదివారం హైదరాబాద్‌లోని హరిహర భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘వైశ్య వైభవ రత్న’ బిరుదుతో పాటు స్వర్ణ కంకణం అందజేసి ఘనంగా సత్కరించారు.
హైదరాబాద్‌కు చెందిన లలిత కళా సమాఖ్య (సామాజిక–సాంస్కృతిక సేవా సంస్థ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ప్రభాకర్‌ను సన్మానించారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి, సమాజ సేవకు, పలు సేవా కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న విశేష కృషిని గుర్తించి ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నల్మాసు ప్రభాకర్ సామాజిక, సేవా, సాంస్కృతిక కార్యక్రమాల్లో నిరంతరం చురుకుగా పాల్గొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని పలువురు వక్తలు కొనియాడారు. ఆయనకు ఈ పురస్కారం లభించడం వ్యక్తిగత గౌరవమే కాకుండా మంథని ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంథని ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, మిత్రులు నల్మాసు ప్రభాకర్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.






