జలకళ లేని గోదారమ్మ
- నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్న నది n నదిలో పచ్చిగడ్డి మేస్తున్న గేదెలు
- నిర్మల్ జిల్లా పరివాహక ప్రాంత రైతుల ఆందోళన
నిర్మల్, జూలై 18 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గోదావరి నది నీళ్లు లేక కలతప్పింది. వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేక వరద నీరు రాకపోవడంతో గోదావరి నది ఎండిపోతున్నది. నిర్మల్ జిల్లా నుంచి వెళ్తున్న గోదావరిలో నీటి ప్రవాహం లేదు. నది మధ్యలో నీళ్లు లేకపోవడంతో అందులో మొలిచిన పచ్చగడ్డిని పశువులు మేస్తున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే శ్రీరాంసాగర్ నిండిన తర్వాతనే నిర్మల్ జిల్లా సోన్ వద్ద గోదావరికి జలకళ వస్తుంది.
ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో నేపథ్యంలో గోదావరిలో ఈ సంవత్సరం వరద నీరు వచ్చే అవకాశం తక్కువగానే ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, బోకర్, ధర్మాబాద్, బిలోలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే శ్రీరాంసాగర్‌లోకి నీరు వచ్చే అవకాశం ఉంది. ఏటా జూన్, జూలై నెలల్లో మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిండితేనే తెలంగాణలోని శ్రీరామ్‌సాగర్‌కు నీరు వస్తుంది. ప్రస్తుతం అక్కడే ఇప్పటివరకు ప్రాజెక్టులు నిండుకోకపోవడంతో ఇక్కడ కరువు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.






