వర్షాల కోసం ప్రత్యేక పూజలు
కృష్ణవేణి గంగమ్మకు అభిషేకాలు
ఉండవల్లి, జులై 18(విజయక్రాంతి): వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని కోరుతూ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన రైతులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండవల్లి మండలం మారమునగాల గ్రామ శివారులోని కృష్ణా నది ఒడ్డుకు ఎద్దుల కాడీలపై బిందెలతో సామూహికంగా చేరుకున్న రైతులు అక్కడ ఉన్న కృష్ణవేణి గంగమ్మ తల్లి విగ్రహాలకు అభిషేకాలు చేసి, వరుణదేవుడిని వర్షాలు కురిపించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా రైతులు నది ఒడ్డునే వంటలు చేసుకుని సామూహికంగా భోజనం చేశారు. అనంతరం కృష్ణవేణి గంగమ్మ ఆలయ ప్రాంగణంలో బొడ్డెమ్మ ఆడి, రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. రైతుల ఈ సంప్రదాయ కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది.






