తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం
- జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
కరీంనగర్, మార్చి 6 (విజయక్రాంతి): భారతదేశంలో అభివృద్ధిలో తెలంగాణను నంబర్ వన్ గా నిలపడమే లక్ష్యంగా ముం దుకు వెళ్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సన్నాహాక సమావేశం ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, సమస్యలపై దృష్టి పెట్టడానికే ప్రగతి ప్రణాళిక స మావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.
భారతదేశంలో వ్యవసాయానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బిలో చాలా సమస్యలున్నాయన్నారు. ఇరిగేషన్, పవర్ సమస్య లను పరిష్కారం చేయడానికే 99 రోజుల ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నిధులు సమీకరణ చేసి అన్ని సమ స్యలు పరిష్కరిస్తామన్నారు. సమైక్యంగా సమిష్టిగా అందరూ అభివృద్ధికి సహకరించాలని, కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలు పుదామని అన్నారు. జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకుందాముని తెలిపారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మా ట్లాడుతూ పది అంశాలు, 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఎమ్మెల్యేలు, అధికారులందరూ ఖచ్చితంగా పాల్గొ నాలన్నారు. పర్యావరణ, రోడ్డు భద్రతా అం శాలపై ప్రగతి ప్రణాళిక ఉంటుందన్నారు. నలుగురు జిల్లా కలెక్టర్లకు ఇంచార్జి మంత్రి ఆఫీసు నుంచి ప్రతిరోజు మానిటరింగ్ ఉం టుందన్నారు. బాధ్యతగా ప్రజా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో భరోసా నింపడానికే ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పలపై పరిపాలన కొనసాగిస్తుందన్నారు. అప్పులు ఉన్నా సంక్షేమంలో ఎక్కడా వెనక్కి తగ్గడు లేదన్నారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధిలో తెలంగాణ ముందుకు వెళ్తుందన్నా రు. అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పది అంశాల ప్రగతి ప్రణాళికలో కొన్ని అంశాలు పరిష్కారమవుతాయన్నారు.
కరీంనగర్-జగిత్యాల నాలుగులైన్ల రహదారి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని, కొం డగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. నారాయణపూర్ రిజర్వా యర్కు కుడి కాలువ, ఎడమ కాలువ పను లు పూర్తి చేయాలన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మా ట్లాడుతూ 99 రోజుల ప్రణాళిక అద్భుతమన్నారు. క్రిందిస్థాయి వరకు అన్ని పథకాలు తీసుకుపోవాలన్నారు.
రామగుండంలో పర్యావరణం పెంచుకోవాలన్నారు. ట్రాన్స్ జెండర్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించామన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత ఏడాదిక్రితం కరీంనగర్ అభివృద్ధి కోసం సమావేశం నిర్వహించారని, కానీ ఒక్క పని కూడా ముం దుకు వెళ్లలేదు, పూర్తి కాలేదన్నారు. ఈ సమావేశంతోనైనా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. స్పెషల్ స్కీమ్ కింద గతంలో 350 కోట్లు మంజూరయ్యాయని, అందులో ఇంకా వంద కోట్లు కరీంనగర్ కు రావాల్సి ఉందన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కల్వల ప్రాజెక్టు 2023లో కొట్టుకుపోయిందని, ప్రభుత్వం వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. హుజూరాబాద్ స్పోరట్స్ సెంటర్ పనులు జరగడం లేదని, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో గై నకాలజిస్టు లేక ఇబ్బంది అవుతుందన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కట్టినా సిబ్బంది లేరన్నారు. 99 రోజుల ప్రణాళికలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




