వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
12-05-2026 10:44 AM
ఎర్రుపాలెం మే 12( విజయ క్రాంతి): మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సాని కృష్ణ (43) వడదెబ్బకు గురై మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులకు ప్రతిరోజూ హాజరవుతుండేవాడు. ఇటీవల ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సోమవారం ఉపాధి పనులకు వెళ్లిన కృష్ణ, పని ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు వారు పేర్కొన్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.






