రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది
సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం.
సమావేశం నిర్వహణ లోపం పట్ల మంత్రి జూపల్లి ఆగ్రహం.
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): రైతు కష్టానికి తగిన గౌరవం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రబీ 2025-26 వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సమావేశపు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారులు, మిల్లర్లు, రవాణాదారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.






