12 May, 2026 | 11:31 AM

Breaking News

సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •  

ఇల్లందులో రాజకీయ దుమారం..

12-05-2026 09:55 AM

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించిన 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య

ఇల్లందు, (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీలో అధికార దుర్వినియోగం, కుటుంబ పాలన, ప్రజాప్రతినిధుల హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆరోపించారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మడుగు సాంబమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు అధికార కార్యక్రమాల్లో అనధికార జోక్యం చేసుకుంటూ ప్రజాప్రతినిధుల వ్యవస్థను అవమానపరుస్తున్నారని విమర్శించారు. తన భార్య, తమ్ముడు, బావమరిది తదితర కుటుంబ సభ్యులను ఉపయోగించి మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

13వ వార్డులో కౌన్సిలర్‌కు సమాచారం ఇవ్వకుండా పంపు కనెక్షన్లు, ట్యాంకర్ల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలులో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వంటి అధికారిక కార్యక్రమాల్లో అర్హత లేకున్నా పాల్గొంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తమ అక్రమాలపై మున్సిపల్ కమిషనర్, డీఎస్పీకి ఫిర్యాదు చేసినందుకే తనపై క్షుద్ర పూజలు, లంకె బిందెలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దండు సారయ్య ఆరోపించారు. గతంలో స్క్రాప్ కుంభకోణం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మడుగు సాంబమూర్తి నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా చేతకాని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను లేదా తన భార్య గెలవలేరని తెలిసి డాక్టర్ చదువుకున్న కూతురిని రంగంలోకి దింపినా ప్రజలు తిరస్కరించారని అన్నారు.

తనపై పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటనలు చేస్తూ, కౌన్సిలర్ విధులకు అడ్డంకులు సృష్టిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ రోహిత్ రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పారు. అవసరమైతే మడుగు సాంబమూర్తి అక్రమాలపై పూర్తి వివరాలను కరపత్రాల రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. 13వ వార్డులో అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని దండు సారయ్య ఆరోపించారు.