ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో ఆహార భద్రత శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆహార భద్రత విషయంలో ప్రతి ఒక్కరు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీ రాములు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ వాసు రామ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మహేష్ లతో కలిసి ఆహార భద్రతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, ఆహార సంబంధిత వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి ఆహార భద్రత శాఖ అధికారులు ఆహార నమూనాలు సేకరించి నాణ్యత ప్రమాణాలు పరీక్షించాలన్నారు. ప్రతి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వివిధ యాజమాన్యాల క్రింద కొనసాగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను పరీక్షించాలని, ఆహార సంబంధిత వ్యాపార, వాణిజ్య సంస్థలలో కలిగి ఉన్న ఆహారం కాల పరిమితి, నాణ్యత పరీక్షించాలని, సంబంధిత సంస్థలు కలిగి ఉన్న ధ్రువపత్రాలు పరిశీలించాలని, సరైన పత్రాలు లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, కాల పరిమితి ముగిసిన ఆహార పదార్థాలు లభించినట్లయితే పూర్తి వివరాలతో నివేదిక అందించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఆహార పదార్థాల నాణ్యత సంబంధించిన ఫిర్యాదుల కోసం 7981904028 నంబర్ లో సంప్రదించవచ్చని, ఆన్ లైన్ లో https://foscos.fssai.gov.in వెబ్ సైట్ ద్వారా సంబంధిత వివరాలతో పాటు ఫోటో అప్ లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత అంగన్వాడీలలో ఆహార నాణ్యతను పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో గత త్రైమాసికంలో మొత్తంగా నాలుగు కేసులు నమోదు కాగా 95 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. ఆహార భద్రత విషయంలో తప్పులను పునరావృతం చేస్తే ఆహార సంబంధిత లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.






