విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పిల్లల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డిలో గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల జోగిపేట (బాలికలు)లో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ సూచనలు, సలహాలు అందించాలని, సమస్యలు ఉన్నపక్షంలో వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అవసరమైతే కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి, విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వసతి గృహాలలో అందిస్తున్న సౌకర్యాలపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
అనంతరం 2025-26 విద్యాసంవత్సరంలో 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ప్రిన్సిపాల్ రజని, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ స్రవంతి, డిప్యూటీ వార్డెన్ జ్యోతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






