27 February, 2026 | 4:39 AM

ప్రయోగాత్మక పాత్రలే లక్ష్యంగా..

27-02-2026 01:19 AM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా పరిశ్రమలో అడుగుపెట్టిన మాళవిక.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించడం ద్వారా ఇప్పుడు దక్షిణాదిన ప్రముఖ స్థానానికి చేరకుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘పాకెట్ నావెల్’తోపాటు పలు సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక దృష్టి అంతా ‘సర్దార్2’పైనే ఉందిప్పుడు. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్2’కు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

2022లో వచ్చిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాళవిక కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఈ అమ్మడి పాత్ర ఎంతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మాళవికకు కొన్ని కూల్, ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయని స్వయంగా తనే ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించింది. “గ్లామర్‌కు మాత్రమే పరిమితమవకుండా ఎక్స్‌పరిమెంటల్ క్యారెక్టర్లు చేయడమంటే తనకు ఇష్టం. ప్రయోగాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే నా లక్ష్యం. నా నుంచి రాబోయే సినిమాల్లో ‘సర్దార్2’ ఒకటి.

ఇందులో నా పాత్ర గత సినిమాల కంటే భిన్నంగా ఉండబోతుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల నరాలు కదిలేలా ఉంటాయి. వాటి కోసం నేను ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సాధారణంగా హీరోలకే పరిమితమయ్యే హై ఆక్టేన్ సీన్స్‌లో భాగమవడం నాకు కొత్త అనుభవం. ఈ సినిమాలో శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా సిద్ధమవాల్సిన సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నా. భారీ సెటప్‌ల మధ్య, టెక్నికల్‌గా కఠినమైన సీన్స్‌లో నటించడం నాకొక పెద్ద సవాల్‌గా అనిపించింది. అయినప్పటికీ ఆ కష్టానికి ఫలితం తెరపై కనిపిస్తుందని నమ్మకంగా చెబుతున్నా” అని చెప్పుకొచ్చింది.