5 May, 2026 | 10:05 AM

అన్నదాత ఆక్రోశం

05-05-2026 01:55 AM
  1. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకోలు
  2. మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ నేతలు

జగిత్యాల/యాదాద్రి భువనగిరి/కోనరావుపేట, మే 4 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కొనాలంటూ సోమవారం పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేశారు. వారికి బీఆర్‌ఎస్ నేతలు మద్దతు తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై రైతులు, బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటకు పైగా రహదారిపై ధర్నా కొనసాగడంతో ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎంసెట్ పరీక్షలకు హన్మకొండ వెళ్తున్న విద్యార్థులు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దీంతో పోలీసులకు రైతులకు నాయకుల మధ్య తీవ్ర తోపులట జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, నాయకులు పునుగోటి కృష్ణ రావు, పులి వెంకటేష్,బిజెపి మండల అధ్యక్షుడు బండ నరసింహ రెడ్డి మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

యాదాద్రి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, కాంట వేసిన 24 గంటల్లో రైతులకు డబ్బులు తమ ఖాతాలో జమచేయాలని రైతులు కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో కుంటెల్లి నాగరాజు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.