రైతు శ్రమ దళారుల పాలు!
- ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం
- కేంద్రాలకు రాని లారీలు వారాలపాటు ధాన్యం కుప్పల వద్ద రైతుల నిరీక్షణ
- ప్రైవేటు వ్యక్తులకు విక్రయం కింటాకు రూ.400 నుంచి రూ.500 నష్టం
భద్రాద్రి కొత్తగూడెం, మే 14, (విజయక్రాంతి): చివరి గింజ వరకు దాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ ప్రకటిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితి నెలకొని ఉంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం, దళారుల హవా కొనసాగటం, రైతులు ఘోరంగా మోసపోవడం జరుగుతుంది. ఆరుగాలం శ్రమించి పగలు రాత్రి కష్టపడి పోసిన వరి నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసి కళ్ళలో ఒత్తులు వేసుకుని పడిగాపులు కాసే పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది.
పాల్వంచ పట్టణ పరిధిలోని పేటచెరువు, బంగారుజాలు, శ్రీనివాస్ కాలనీ, గుడిపాడు, కొత్తూరు, పిల్లవాగు తదితర గ్రామాల రైతుల పరిస్థితి పరిశీలిస్తే ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని తేటతెల్లమవుతుంది. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు వడిగాపులు కాస్తున్న వారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలు ధాన్యాన్ని తడిసి ముద్ద చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది.
దళారుల హవా..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతుల వద్ద ఉన్న ధాన్యంలో సుమారు 90% వరకు ప్రైవేటు దళారుల వరం అవుతోంది. అతి తక్కువ ధరకు దళారులు ధాన్యం కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారు. ఈ పరిస్థితికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రైతులు మండిపడుతున్నారు. క్వింటా ధాన్యాన్నీ దళారులు రూ1800 చొప్పున కొనుగోలు చేస్తూ వెంటనే లారీల్లో తరలించడం జరుగుతుంది. అంటే సుమారు రూ 400 నుంచి 5 వందలు రైతు నష్టపోవాల్సి వస్తోంది.
అప్పుల ఊబిలో రైతన్నలు
వరి మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఇప్పటికే ఎరువులు విత్తనాలు కూలీల ఖర్చుతో అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ధాన్యాన్ని సకాలంలో అమ్ముకొని కష్టాల నుంచి బయటపడదామంటే అధికారుల తీరు మూలిగే నక్కపై తాటి పండు అన్న చందాన ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు సరఫరా కావడం లేదని, దాన్యం నిలువ చేసేందుకు గోదాములు దొరకటం లేదని క్షేత్రస్థాయిలో కొనుగోలులో జాప్యం చేస్తున్నారు.
రైతు ఓటుతో గెలిచే రైతన్న మోసం చేస్తున్నారు
రైతులకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయించి తీవ్రంగా మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కనగాల అనంత రాములు ఆరోపించారు. గురువారం పాల్వంచ పట్టణ పరిధిలోని బంగారుజాలు, పిల్లవాగు, పేటచెరువు, శ్రీనివాస్ కాలనీ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చోటు చేసుకోవడం వల్ల దళారుల హవా కొనసాగుతుందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని ఆయన ధ్వజమెత్తారు. రైతు ఆగ్రహానికి గురికాకముందే ప్రభుత్వం దాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
- కనగాల అనంత రాములు






