చెట్లతో కమ్ముకుపోయిన ఉపాధి హామీ భవనం
ప్రమాదానికి ముందే చర్యలు తీసుకోవాలి
అశ్వాపురం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయ భవనం తీవ్ర నిర్లక్ష్యానికి గురై చెట్లతో పూర్తిగా కప్పుకుపోయిన దుస్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. భవనం పైకప్పు, గోడలపై పెరిగిన వృక్షాలు నిర్మాణాన్ని బలహీనపరుస్తూ ప్రమాద సూచనలుగా మారుతున్నాయి. పైకప్పు అంచుల నుంచి వేలాడుతున్న వేళ్ళు, మొలకెత్తిన చెట్లు ఎప్పుడైనా కూలిపోవచ్చనే భయం ప్రజల్లో నెలకొంది.
దీర్ఘకాలంగా శుభ్రపరిచే పనులు చేపట్టకపోవడం, నిర్వహణలో అలక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, భవనం చుట్టూ పెరిగిన చెట్లు మరియు చెత్త కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి భవనాన్ని వెంటనే శుభ్రపరచడంతో పాటు మరమ్మతులు చేపట్టి సురక్షిత వాతావరణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని వారు హెచ్చరిస్తున్నారు






