16 April, 2026 | 4:05 AM

పదవుల పందేరం

16-04-2026 01:58 AM
  1. రేపో మాపో ఫెడరేషన్ల పదవులు భర్తీ 
  2. ఆ తర్వాత కార్పోరేషన్లు, పార్టీ పదవుల్లో నియామకాలు 
  3. సీఎం రేవంత్‌రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ భేటీ 
  4. నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో ఆశావాహుల జాబితా పరిశీలన 
  5. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించాలని నిర్ణయం
  6. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మహిళకు ఛాన్స్ 
  7. ప్రచార కమిటీ, పీసీసీ కోశాధికారి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీపై ఏకాభిప్రాయం కుది రింది. ఒకటి, రెండు రోజుల్లో, ముందుగా వివిధ కులాల ఫెడరేషన్లను భర్తీచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కార్పోరేషన్లు, ఖాళీ పదవుల భర్తీ చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ దాదాపు నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులతో పాటు కొందరు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరో పణలకు సంబంధించి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆశావాహుల పేర్లపై చర్చించారు. వీటితో పాటు పీసీసీ పూర్తిస్థాయి కమిటీ నియామకం,  మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌పై చర్చించారు.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు భర్తీచేయకపోవడం వల్లే పార్టీ కేడర్‌లో అసంతృప్తులు ఉన్నాయనే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కొందరి పేర్లపై కూడా చర్చించారు. మొదటి నుంచి పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్న వారిని గుర్తించి పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా 18 కులాల ఫెడరేషన్ల భర్తీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

వడ్డెర, వాల్మీకి బోయ, రజక, నాయిబ్రాహ్మణ, పూసల, సగర, బట్రాజులు, విశ్వబ్రాహ్మణ, క్రిష్టబలిజ, కుమ్మరి, గీత కార్మిక, బ్రాహ్మణ పరిషత్,  గొర్రెల, మేకల పెంపకదార్ల సం ఘం, మేదర ఫెడరేషన్లతో పాటు ఆర్టీసీ కార్పోరేషణ్, బ్రూవరేజెస్, మూసీ రివర్‌ఫ్రంట్ కార్పోరేషన్, రెడ్‌కో, జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల భర్తీని కూడా చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇక పార్టీ పదవుల విషయంలో పూర్తిస్థాయిలో పీసీసీ కమిటీని నియమించాలనే నిర్ణయానికి వచ్చారు.

ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ కోశాధికారి, ప్రచార కమిటీని పదవులను త్వరలోనే భర్తీని జూన్ 2 వరకు పూర్తిచేయాలనే అభిప్రాయానికి వచ్చా రు. వీటితో పీసీసీ కమిటీ లో ఉన్న ఖాళీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీని పూర్తి స్థాయిలో నియమించాలని నిర్ణయించారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో నలుగురికి అవకాశం ఇవ్వనున్నారు. వీటిలో ఒకటి ఓసీ సామాజికవర్గంలోని రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఒక మహిళకు కూడా చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

రెడ్డి సామాజికవర్గం నుంచి వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎస్సీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎస్టీ నుంచి ఎంపీ బలరాంనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్ గౌడ్ ఉండటంతో మహిళా కోటాలో బీసీ వర్గానికి చెందిన సరితా తిరుపతయ్య యాద వ్ పేరు పరిశీలనకు వచ్చినట్లుగా సమాచారం.

ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రస్తు తం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి పేరు వినిపిస్తోంది. పీసీసీ కోశాధిరిగా రోహిన్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, ఈ విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టాలనే అభిప్రాయానికి వచినట్లుగా తెలిసింది. 

ఢిల్లీ వెళ్లిన సీఎం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో గురువా రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి ‘ఇండీ’ కూటమి నేతలకు  రెండు రోజుల పాటు  హస్తినలోనే అందుబాటులో ఉండననున్నారు. అదేవిధం గా రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి  ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కూడా సీఎం హాజరుకాను న్నారు.

ప్రధానంగా కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్టాలకు అన్యాయం జరగు తుందని సీఎం రేవంత్ మొదటినుంచి చెబుతున్నారు. ఇదే అంశాన్ని ‘ఇండీ’ కూటమి కూడా చెబుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు జరిగే లాభం, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ‘ఇండీ’ కూటమి నేతలతో జరిగే సమావేశంలో సీఎం మరోసారి వివరించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.