నిర్ణీత గడువులోపు గణన ఫారాల పంపిణీ పూర్తి చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి
మహబూబాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గణన ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ జిల్లా నుంచి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గణన ఫారాలను బూత్ స్థాయి అధికారులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తులతో గణన ఫారాలను పంపిణీ చేయకూడదని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటిింటికి వెళ్లి గణన ఫారాలను పంపిణీ చేయాలని, ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
గణన ఫారాన్ని సమర్పించిన ఓటర్ల వివరాలు మాత్రమే ముసాయిదా ఓటరు జాబితాలో కొనసాగించబడతాయని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు నిర్ణీత గడువులోపు ఇంటింటికీ వెళ్లి గణన ఫారాల పంపిణీని పూర్తి చేయడంతో పాటు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, ఆర్డీవోలు రాజేశ్వరి, గణేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






