7 June, 2026 | 2:33 AM

బోధన్.. నాడు మహానగరం

07-06-2026 12:00 AM

బాహుబలి ఏలిన నేల ఇది.. జైనం, బౌద్ధం విలసిల్లింది ఇక్కడే.. బకాసురుడిని భీముడు అంతమొందించింది ఈ ప్రాంతంలోనే.. హిందూ దేశంలోని పదహారు మహాజనపదాల్లో ఒకటైన ‘అస్మక’కు రాజధాని కూడా ఈ నగరమే.. ఇన్ని ప్రత్యేకతలున్న బోధన్ పట్టణం 2,600 ఏళ్ల క్రితమే మహానగరంగా విరాజిల్లినట్లు చరిత్ర చెబుతోంది. 

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో షోడశ (పదహారు) జనపదాలు ఉండగా.. అందులో దక్షిణ భారతదేశం నుంచి ఏకైక జనపదం అస్మక. ఈ అస్మక రాజ్యానికి రాజధాని నేటి బోధన్. ఆ కాలంలో దీనిని పోతన అని కూడా పిలిచేవారు. అప్పటికే బో ధన్ ప్రసిద్ధ నగరమని, 6వ శతాబ్దానికి ముందే ఏర్పాటై ఉండవచ్చని చరిత్రకారులు చెపుతారు.

అంతకంటే ముందే బాహుబలి.. బోధన్ నగరాన్నే రాజధానిగా పాలించవచ్చు. బోధన్ జైన కేంద్రంగా విలసిల్లిన వాస్తవాన్ని ఇక్కడ లభించిన జైన విగ్రహాలు స్పష్టం చేస్తున్నాయి. మౌర్యుల కాలం లో ఈ ప్రాంతానికొచ్చిన గ్రీకు దేశస్తుడు మెగస్తనీస్.. చు ట్టూ గోడలు ఉన్న 30 మహానగరాల్లో ఆంధ్రులు నివసించారని తన ‘ఇండికా’ గ్రంథంలో రాశాడు. 30 నగరాల్లో బోధన్ కూడా ఒకటి. చాళుక్యుల పూర్వీకుడైన మొదటి యు ద్ధమల్లుడు బోధన్‌లో తన 500 ఏనుగులకు తైలస్నానం చేయించాడని ‘పంపడు’ కవి రాసిన భారతం చెబుతోంది.

బోధన్‌లో భారీ బాహుబలి విగ్రహం

జైన తీర్థంకరుల్లో మొదటివాడైన రిషభదత్తుని కుమారుల్లో ఒకరు బాహుబలుడు.. ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఒకసారి తన అన్న భరతుడు బాహుబలుని రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తాడు. ఇద్దరికీ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు బాహుబలికి వైరాగ్యం కలిగి రాజ్యాన్ని అన్నకే ఇవ్వాలని అనుకుంటాడు. యుద్ధ సమయంలో తాను ఉన్న చోటనే కాయోత్సర్గ భంగిమలో (నిలబడి) తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బాహుబలి కాళ్లకు, చేతులకు.. తీగలు, పాములు చుట్టుకుంటాయి. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భరతుడు.. బోధన్‌లో 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి శిలా విగ్రహం ఏర్పాటు చేశాడు.

శ్రీ చక్రేశ్వర శివాలయం చరిత్ర

మహాభారతంలో చెప్పిన భీమ, బకాసుర యుద్ధం బోధన్ ప్రాంతంలోనే జరిగిందని ఇక్కడివాళ్ల నమ్మకం. బోధన్ ప్రాంతంలో బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బోధనన్‌కు అప్పట్లో బహుధాన్యపురం అనే పేరుండేది. ఇక్కడ అనేక రకాల పంటలు పండేవి. అందుకే బకాసురుడు ఇక్కడ ఉండేవాడు. గ్రామస్తులు బండెడు అన్నం, ఒక మనిషిని రోజూ అతడికి ఆహారంగా పంపేవాళ్లు. ఆ రాక్షసుడు అవన్నీ భుజించి ఊరిపై దాడి చేయకుండా ఉండేవాడు.

రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు బహుధాన్యపురానికి వస్తారు. అప్పుడు బకాసురుడి గురించి భీముడి కి తెలుస్తుంది. బకాసురుడితో యుద్ధం చేసి అతన్ని చంపుతాడు. ఆ తర్వాత భీముడు, శాండిల్య మహాముని కలిసి ఇక్కడ ఒక ఆలయం కట్టించి శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది.

అయితే ముస్లిం రాజులు దండయాత్రలు చేసి ఆలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో.. భీముడు, శౌండిలయ్య మహాముని నిర్మించిన ఆలయాన్ని రక్షించేందుకు దాన్ని ఇసుక, రాళ్లతో కప్పేస్తారు. అలా కప్పిన ఆలయాన్ని వందల ఏళ్ల పాటు ప్రజలు మరిచిపోయారు. అయితే 1959లో ఒక రైతు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని చదును చేస్తుండగా గర్బాలయ శిఖరం కనిపించింది. రాళ్లను తొలగించి చూస్తే ఆలయం చెక్కుచెదరకుండా ఉంది. అదే ఇప్పుడున్న శ్రీచక్రేశ్వర ఆలయం అని చరిత్ర చెబుతుంది.

బోధన్ (విజయక్రాంతి)